నకిలీ మొక్కజొన్న విత్తనాలతో మోసం
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:59 AM
మంత్రాలయం మండలంలోని పరమానదొడ్డి గ్రామానికి చెందిన రైతులు సుగాలి పరమేష్ నాయక్, సుగాలి గణపతినాయక్ నకిలీ విత్తనాలతో మోసపోయారు.
రైతుల ఫిర్యాదుతో పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు
మాధవరం పోలీసు స్టేషనలో అన్నదాత ఫిర్యాదు
మంత్రాలయం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలంలోని పరమానదొడ్డి గ్రామానికి చెందిన రైతులు సుగాలి పరమేష్ నాయక్, సుగాలి గణపతినాయక్ నకిలీ విత్తనాలతో మోసపోయారు. గత ఐదు నెలల క్రితం యూపీఎల్ కంపెనీకి చెందిన వగరూరు సీడ్ ఆర్గనైజర్ వద్ద 8.50 ఎకరాలకు మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసి తమ పొలంలో నాటారు. పంట ఏపుగా పెరిగింది. కాయ వచ్చేసరికి కాయలో విత్తనాలు లేకపోవడంతో రైతు లు అవాక్కయ్యారు. వెంటనే సీడ్ ఆర్గనైజర్స్‌కు, వ్యవసాయా ధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం నంద్యాల సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్టు డా. రామకృష్ణరావు, డా. వెంకటరమణ, సీనియర్ ప్లాంట్ రీడింగ్ అధికారి డా. సుజాతమ్మ, మండల వ్యవసాయాధికారి జీర గణేష్ పంటను పరిశీలించారు. పంట చేతికందే సమయంలో మొక్కకు ఉన్న కంకిలో విత్తనాలు లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. రైతులు వినియోగించిన మందులు, భూమి స్వభావం విచారించి నివేదికను జిల్లా అధికారులకు పంపుతామని తెలిపారు. ఇందులో పరమేష్ నాయక్ మూడెకరాలు, గణపతి నాయక్ 5.50 ఎక రాలో సాగు చేసి దాదాపు 8.50 లక్షల వరకు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకుని సాగు చేసుకున్న గిరిజన రైతులకు న్యాయం చేయాలని మాధవరం పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ పరిశీలనతో వీఏఏలు రాజేశ్వరి, లలిత, రైతులు పాల్గొన్నారు.