ప్రగతి కార్డులను అందజేయండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:28 PM
జిల్లాలోని విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రగతి కార్డులను ఈ నెల 21వ తేదీ నాటికి అందించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా పైతరగతులకు 4,21,632 మంది విద్యార్థులు
జాయింట్ కలెక్టర్ బి. నవ్య
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రగతి కార్డులను ఈ నెల 21వ తేదీ నాటికి అందించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆదేశించారు. గురువారం పాఠశాలల ముగింపునకు సంబంధించి వెబ్ ఎక్స్ ద్వారా విద్యాశాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రగతి కార్డులను 21వ తేదీ నాటికి అందించి ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేయాలన్నారు. పైతరగతులకు చేర్చే ప్రక్రియ పూర్తి చేసి సోమవారం నాడు కొత్త తరగతుల్లో కూర్చునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,21,632 మంది విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నందున వారందరికీ స్కూల్ ప్రత్యేకతలను తెలియజేయాలన్నారు. 1,886 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యలోకి చేరుతున్న వారందరినీ పాఠశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై సీఎస్ సమీక్ష: వేసవిలోని జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశంలో మాట్లాడుతూ కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలన్నారు.