ఎన్నాళ్లీ యాతన..!
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:25 AM
రాయలసీమ వాసులకు ఆరోగ్య సంజీవనిగా పేరొందిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలు వెంటాడుతున్నాయి.
కర్నూలు జీజీహెచ్‌లో సమస్యలు
నిధులు లేక ఆగిపోయిన ఐపీడీ బ్లాక్
రోగులకు తప్పని తిప్పలు
పూర్తి స్థాయిలో లభించని సేవలు
నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ రాక
స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ పరికరాల ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ వాసులకు ఆరోగ్య సంజీవనిగా పేరొందిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్యసేవలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గత వైసీపీ హయాంలో కొత్త భవనాల పేరుతో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆపరేషన్ థియేటర్లకు సంబంధించిన పాత భవనాలను పడగొట్టి కొత్తగా ఐపీడీ బ్లాక్ నిర్మాణ పనులు చేపట్టింది. కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద రూ.500 కోట్లతో భవనాల నిర్మాణ పనులను ప్రారంభించింది. భవనాలకు రూ.350కోట్లు, పరికరాలకు రూ.150కోట్లు కేటాయిం చారు. ఆసుపత్రిలో ఐపీడీ బ్లాక్, కర్నూలు మెడికల్ కాలేజీలో లెక్చరర్ గ్యాలరీ పనులను హైదరాబాదుకు చెందిన కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్ ప్రారంభించారు. కాంట్రాక్టరుకు రూ.17.89 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు కొత్త పనులకు అనుమతులు లేకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. శనివారం జిల్లా పర్య టనలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పర్యటిస్తారు. మంత్రి నేరుగా ఆసుపత్రిని సందర్శించి సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మెడికల్, సర్జరీ రోగుల అవస్థలు
కొత్త భవనాల పేరుతో పాత భవనాలను కూల్చివేయడంతో ఆ స్థానంలో ఉన్న మెడికల్, సర్జరీ రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యంత రద్దీ ఉన్న ఎంఎం-1, ఎంఎం-2, ఎంఎం-5, ఎంఎం-6, ఎంఎం-7, సర్జరీ యూనిట్ల వార్డులను పాత చిన్న పిల్లల విభాగం, ట్రామాకేర్, ఓల్డ్ గైనిక్ వార్డులోకి రోగులకు తరలించారు. ట్రామాకేర్‌లో భవనాలు చాలక వరండాలోనే రోగులను ఉంచుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఐపీడీ బ్లాకు నిర్మాణాలు పూర్తయితే 600 పడకలు అందుబాటులోకి వస్తాయి. కానీ నిర్మాణాలు మాత్రం నత్తనడకన సాగుతూ ఎప్పుడు పూర్తవుతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రామాకేర్ నిరూపయోగం
ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించేందుకు కర్నూలు జీజీహెచ్‌లో ట్రామాకేర్ యూనిట్‌ను ఏర్పాటుచేశారు. జాతీయ రహదారులు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇటీవల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రామాకేర్ యూనిట్ నిరూపయోగంగా మారింది. ఆసుపత్రికి అనంతపురం, సత్యసాయి జిల్లా కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలతో పాటు తెలంగాణలోని గద్వాల జిల్లాల నుంచి ప్రజలు చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. కొద్దిరోజులుగా ట్రామాకేర్ పేరు మరుగున పడిపోయింది. ఈ ట్రామాకేర్ భవనంలో ఎంఆర్‌ఐ యంత్రంతో పాటు మెడికల్, న్యూరోసర్జరీ యూనిట్లను పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అలాగే ట్రామాకేర్ కింద నియమితులైన సిబ్బంది, వైద్యులను ఇతర విభాగాలకు తరలించి సేవలందిస్తున్నారు.
‘సూపర్ స్పెషాలిటీ కాంప్లెక్స్’
రాయలసీమ వాసులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న ఉద్దేశంతో 1993 సెప్టెంబరు 26న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. 33 ఏళ్లు దాటినప్పటికీ సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో యురాలజీ, నెఫ్రాలజీ, కార్డియోథోరాసిక్, ఐసీయూ వార్డు, కార్డియాలజీ, క్యాథ్‌ల్యాబ్, నెప్ర్లోప్లస్ డయాలసిస్ సెంటర్, న్యూరోసర్జరీ వార్డు, యూరాలజీ న్యూరోసర్జరీ ఆపరేషన్ థియేటర్లు సేవలు అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలకు సంబంధించిన ఎండోక్రైనాలజీ, న్యూరాలజీ విభాగాలకు భవనాలు లేకపోవడంతో ఎంసీహెచ్ బ్లాక్‌లో సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలం సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలు పెరిగాయి. రోగులు పెరిగారు. దాదాపు 8 స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. పీజీల సంఖ్య పెరిగింది. పెరిగిన రోగులకు అనుగుణంగా కొన్ని వార్డులో నిర్వహణ సరిగ్గా లేక పెచ్చులూడిపోతున్నాయి. దీంతో యూరాలజీ న్యూరోసర్జరీ విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను మూడో అంతస్థు నుంచి ఖాళీ చేయించారు. పొరుగు జిల్లా అనంతపురం నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పీఎంఎస్‌వీ కింద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రూ.150 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించారు. అదే తరహాలో కర్నూలు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేయాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రిని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కర్నూలులో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సేవలు
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యసేవలు అందుబాటులో రానున్నాయి. కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణంలో 9.30 ఎకరాల్లో స్థలంలో రూ.120 కోట్ల వ్యయంతో 120 పడకల స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను 2019 జనవరి 8న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి భవనం పూర్తి కాగా, ఇటీవలే రూ.28 కోట్ల విలువైన లీనియర్ యాక్సిలేటర్ యంత్రం, రూ.9.88 కోట్లతో సిటీ సెమిలేటర్ ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా వర్క్‌స్టేషన్ అందుబాటులో వచ్చాయి. రూ.5 కోట్ల హెచ్‌డీఆర్ బ్రాంకోథెరపి, 19 కోట్ల పెట్‌స్కాన్, రూ.1.50 కోట్ల విలువైన మయోగ్రమ్ పరికరాలు రావాల్సి ఉంది. రాయలసీమ ప్రాంత ప్రజలకు అత్యుత్తమ స్థాయిలో క్యాన్సర్ సేవలు అందించేలా స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో డైరెక్టర్‌తో పాటు 25 మంది వైద్యులు, 26 మంది నర్సింగ్ సిబ్బంది, 10 మంది రేడియేషన్ థెరపి టెక్నీషియన్, డైటీషియన్ అందుబాటులో ఉన్నారు. శనివారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో అత్యాధునిక హైయర్ మిషన్ అన్ని రకాల రేడియేషన్ క్యాన్సర్‌కు చికిత్స అందించే లీనియర్ యాక్సిలేటర్ యంత్రం పోటో ఎగ్జిబిషన్, మెడికల్ అంకాలజి వార్డును ప్రారంభించనున్నారు.
కార్పొరేట్‌కు దీటుగా సేవలు
స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్‌లో కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన సేవలు అందనున్నాయి. ఇప్పటికే హాస్పిటల్‌కు రూ.28 కోట్లు లీనియర్ యాక్సిలేటర్, సిటీ సెమిలేటర్, హాస్పిటల్‌కు చేరాయి. ఆసుపత్రిలో 120 పడకలు ఉండగా.. 87 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
- డా. సీఎస్ కృష్ణప్రకాష్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, కర్నూలు
నేడు పరికరాల ప్రారంభం
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పరికరాలను ప్రారంభించడానికి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఉదయం వస్తారు. కర్నూలు జీజీహెచ్‌లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ విభాగాలను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం కర్నూలు మెడికల్ కాలేజీ న్యూలెక్చరర్ గ్యాలరీలో మంత్రి వైద్యులతో సమీక్ష నిర్వహిస్తారు.
- డా. కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు