ఖరీఫ్ ఎరువులు సిద్ధం
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:48 AM
గత వైసీపీ ప్రభుత్వంలో రూ. కోట్లు ఖర్చు పెట్టి ఆర్‌బీకే భవనాలను ఏర్పాటు చేశారు. కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు.
సప్లయ్ కోసం అన్ని సొసైటీలకు లైసెన్స్‌లు జారీ
ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఎరువులు: మార్క్‌ఫెడ్ డీఎం రాజు
గత వైసీపీ ప్రభుత్వంలో రూ. కోట్లు ఖర్చు పెట్టి ఆర్‌బీకే భవనాలను ఏర్పాటు చేశారు. కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. అయితే రైతులకు అవసరమైన ఎరువులను మాత్రం సప్లయ్ చేయలేకపోయారు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించక తప్పలేదు. ఏటా ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో వివిధ కాంప్లెక్స్ ఎరువులు, డీఏపీ యూరియా దాదాపు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఈ ఎరువులను రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే బాధ్యత మార్క్‌ఫెడ్ సంస్థ చూసుకుంటోంది.
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 45 డీసీఎంఎస్ కేంద్రాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు పూర్తి స్థాయిలో ఎరువులను సప్లయ్ చేశారు. మార్క్‌ఫెడ్ సంస్థ 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు లైసెన్స్‌లను జారీ చేసింది. బ్యాంకు గ్యారెంటీలను కూడా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందించింది. దీంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లోని రైతులంతా తమకు అవసరమైన ఎరువులను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాలకు ఎరువుల సప్లయ్‌ను పూర్తిగా తగ్గించేశారు. ఆర్‌బీకేలకు ఎరువులను అందిస్తున్నామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పుకోవడం తప్పితే.. ఏ ఆర్‌బీకే కేంద్రాలకు పూర్తిస్థాయిలో ఎరువులను అం దించలేకపోయారు. ఆర్‌బీకే కేంద్రాల్లో సిబ్బంది కూర్చొనేందుకు కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఎరువులను తెచ్చి ఎక్కడ నిల్వ చేయాలో ఆ కేంద్రాల సిబ్బందికి దిక్కు తెలియడం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను పూర్తి స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్‌ల ద్వారా రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల కొరత రానీయం
గ్రామాల్లో రైతులకు సరిపడ అన్ని రకాల ఎరువులను మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా వచ్చే ఖరీఫ్‌కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సహకార బ్యాంక్ గ్యారెంటీ అందిస్తోంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులకు కొరత లేదు. ఎంఆర్‌పీ ధరకే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో ఎరువులను రైతులకు అందుబాటులోకి ఉంచుతున్నాం.
- రాజు, మార్క్‌ఫెడ్ కర్నూలు మేనేజర్