మాయాజలం..!
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:53 PM
జీవనశైలిలో భాగంగా ప్రజలు ప్యూరిఫైడ్ నీటిని తాగేందుకు అలవాటు పడ్డారు. ఆరోగ్యం కోసం అంటూ ఆర్వో ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు.
పుట్టగొడుగుల్లా ఆర్వో ప్లాంట్లు
నిబంధనలు పాటించని నిర్వాహకులు
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
అనుమతులు లేకుండానే వ్యాపారాలు
తనిఖీలు చేయకపోవడంతో ఇష్టారాజ్యం
ఆదోని, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జీవనశైలిలో భాగంగా ప్రజలు ప్యూరిఫైడ్ నీటిని తాగేందుకు అలవాటు పడ్డారు. ఆరోగ్యం కోసం అంటూ ఆర్వో ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. నిజానికి ఆర్వోపాంట్లలో స్వచ్ఛమైన తాగునీరు వస్తున్నాయా? అన్న విషయాన్ని కూడా పక్కనే పెట్టే ప్రజలు ఆర్వో నీటి కోసం పరుగులు పెడుతున్నారు. జనావాసాల మధ్య బోర్లు వేసి నిబంధనలు పాటించకుండా వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో తూతూమంత్రంగా బోరు నీటిలో కొన్ని కెమికల్స్ కలిపి నీటిని సరఫరా చేస్తున్నారు. నిబంధనలు పాటించని నీటి ప్లాంట్లపై అధికారులు తనిఖీలు చేయకపో వడం నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాణ్యత లేని నీటిని తాగి పలు ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు సైతం అనధికారి కంగా కొనసాగుతున్న తాగునీటి ప్లాంట్లవైపు కన్నెత్తి చూడక పోవడంతో నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. ఏది ఏమైనా కర్నూలు జిల్లాలో నిబంధనలను కాలరాస్తూ సురక్షిత నీటి పేరుతో విచ్చలవిడిగా ఆర్వో ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. అసలే వేసవి కావడంతో ఇదే అదునుగా భావించి జిల్లాలో ఎక్కడ చూసినా ఆర్వో ప్లాంట్‌లు (తాగునీటి సురక్షిత ప్లాంట్) విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ఆదాయమే లక్ష్యంగా నిర్వాహకులు నిబంధనలకు పాతరేసి విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలో ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత నీటి పేరుతో నెలకు రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది. బిందె రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా 20 లీటర్ల వాటర్‌క్యాన్ రూ.10 నుంచి రూ.15 వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో రోజుకు 16 లక్షల లీటర్ల పైగా అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. పట్టణాల్లో అయితే ట్రేడ్ లైసెన్స్ తీసుకొని అక్రమంగా నీటి వ్యాపారం సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తనిఖీలు చేస్తున్నారా?
జిల్లాలో ఆర్వో ప్లాంట్ ద్వారా నెలకు రూ. కోట్లలో వ్యాపారం జరుగుతోంది. నిబంధనలు పాటించని ఆర్వో ప్లాంట్ నిర్వాహకులపై తనిఖీలు ఆశించిన స్థాయిలో చేయకపోవడంతో ఆయా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసి సొమ్ముచేసుకుంటున్నారు. కనీస నిబంధనలు పాటించకపోవడంతో పాటు సదరు ఆర్వోప్లాంట్ల ద్వారా వచ్చే నీరు సురక్షితమైనదా? కాదా? అనే తెలుసుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆర్వో ప్లాంట్ల నుంచి ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యాన్ని నీటి రూపంలో కొని తెచ్చుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులను కట్టడి చేయాలని నీటి శుద్ధి ప్రక్రియ చేయని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నాణ్యతా ప్రమాణాలను అతిక్రమించి నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు మంగళం
నిబంధనల ప్రకారం ఎవరైనా ఆర్వో ప్లాంట్ పెట్టాలంటే స్థానిక పంచాయతీ లేదా.. సచివాలయం, మున్సిపాలటీల ద్వారా అనుమతి పొందాలి. అదేవిధంగా ట్రేడ్ లైసెన్సు కూడా పొందాలి. తమ దరఖాస్తుతో పాటు అద్దె లేదా సొంత స్థలానికి సంబంధించిన ఆస్తి పన్నుల వివరాలు, తమ అడ్రస్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను అందజేయాలి. ప్రధానంగా నీటి నాణ్యతను ధ్రువీకరించే ఐఎస్ ఐ వంటి సంస్థల నుంచి పత్రం పొందాలి. బోర్ పర్మిషన్ కూడా ఉండాలి. నిజానికి ఒక ప్లాంట్ ఏర్పాటు కోసం సుమారుగా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన పాలిథిలిన్, పాలీ ఫ్రాఫలైన్‌తో తయారు చేసిన నీటి క్యాన్లను మాత్రమే వినియోగించాలి. నీటి నాణ్యతను పరిశీలించేందుకు కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ నిబంధనలను లెక్కచేయని నిర్వాహకులు రూ.2లక్షల ఖర్చుతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓ రేకుల షెడ్డు, సింథటిక్ ట్యాంకు, తక్కువ ధరకు ఓ నీటి శుద్ధి యంత్రంతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని నీటిని విక్రయిస్తున్నారు.
ఇవేమైనా పాటిస్తున్నారా?
ప్రతి రోజూ టోటల్ డిసాల్వడ్ సాలిడ్స్(టీడీఎస్) పరికరంతో పరిశీలించి నీటి సాంద్రత ఎంత ఉందో నమోదు చేసుకోవాలి.
ఆర్వో ప్లాంట్ల నుంచి నీటిని తీసుకెళ్లే క్యాన్లు మూడు లేదా.. నాలుగు నెలలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత వినియోగించరాదు.
ప్రతి నెల ప్లాంట్లలోని యంత్రాల్లో ఉండే ఫిల్టర్లను శుభ్రం చేయాలి. పాడైతే తక్షణమే కొత్తవి వేయాలి.
ఆర్వో ప్లాంట్ల నుంచి సరఫరా చేసే క్యాన్లపై తమ కంపెనీ వివరాలు, ధర, నీటి ప్యాకింగ్ తేది, ఐఎస్‌ఐ సర్టిఫికెట్ నంబరు, లైసెన్స్‌తో పాటు తమ ప్లాంట్ వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి.