Share News

మెడికో ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:37 AM

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలో ఉన్న విశ్వభారతి మెడికల్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువున్న మెడికో అంకె హన్షిక(19) గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాలలో ఇంటర్నల్‌ పరీక్షలు బాగా రాయలేదని మనస్థాపానికి గురైన విద్యార్థిని కళాశాల మూడో అంతస్తు నుంచి దూకేసింది.

మెడికో ఆత్మహత్యాయత్నం
మెడికోను పరిశీలిస్తున్న డీఎస్పీ బాబుప్రసాద్‌, వైద్యులు

కర్నూలు విశ్వభారతి మెడికల్‌ కళాశాలలో ఘటన

ఇంటర్నల్‌ పరీక్షలు బాగా రాయలేదని మనస్తాపం

విద్యార్థిని పరిస్థితి విషమం

గూడూరు/కర్నూలు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలో ఉన్న విశ్వభారతి మెడికల్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువున్న మెడికో అంకె హన్షిక(19) గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాలలో ఇంటర్నల్‌ పరీక్షలు బాగా రాయలేదని మనస్థాపానికి గురైన విద్యార్థిని కళాశాల మూడో అంతస్తు నుంచి దూకేసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన అంకె శ్రీనివాసులు, అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో హన్షిక మొదటి సంతానం. నీట్‌లో ర్యాంక్‌ సాధించి కేటరిగి-ఏ కింద వైద్య విద్య (ఎంబీబీఎస్‌) సీటు సాధించింది. నగర శివారులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీలో సీటు రావడంతో డిసెంబరులో కళాశాలలో చేరింది. కళాశాల యాజమాన్యం ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇంటర్నల్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. మొదటి ఇంటర్నల్‌ పరీక్షలు బాగా రాసి పాస్‌ అయింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన రెండో ఇంటర్నల్‌ పరీక్షలు బాగా రాయలేదని మానసికంగా మదనపడుతూ తోటి విద్యార్థులతో బాధపడేది. గురువారం తన మిత్రులతో ఇదే విషయంపై బాదపడితే వారు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం హన్షిక కళాశాల మూడో అంతస్తు పైకెక్కి దూకేసింది. తలకు గాయాలు కాగా, భుజం ఎముకలు, వెన్నెముకలు బాగా దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల్లో రస్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. మెడికో హన్షిక పై అంతస్తు నుంచి దూకినప్పుడు ఓ విద్యార్థిని చూసిందని పోలీసులు తెలిపారు. అదే కాలేజీలో పీజీ చదువుతున్న జూనియర్‌ డాక్టర్లు హన్షికను స్కూటిపై ఎక్కించుకొని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌, కర్నూలు తాలుకా సర్కిల్‌ సీఐ చంద్రబాబు, ఎస్‌.నాగులాపురం ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమాచారం తెలియగానే విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని విలపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.

Updated Date - Apr 25 , 2025 | 12:37 AM