Share News

అవిశ్వాసమే నెగ్గింది

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:56 AM

ఆదోని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 35 మంది కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి బుధవారం ఉదయాన్నే చేరుకున్నారు. వీరితో పాటు 30వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నాగరత్న కౌన్సిలర్‌తో పాటు ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ కూడా వచ్చారు

అవిశ్వాసమే నెగ్గింది
అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతున్న కౌన్సిల్‌ సభ్యులు, ఎమ్మెల్సీ మధుసూదన్‌

అవిశ్వాస తీర్మానానికి ప్రిసైడింగ్‌ అధికారిగా

హాజరైన సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా దిగిపోయిన శాంత

హాజరు కాని ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 35 మంది కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి బుధవారం ఉదయాన్నే చేరుకున్నారు. వీరితో పాటు 30వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నాగరత్న కౌన్సిలర్‌తో పాటు ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ కూడా వచ్చారు. వీరందరినీ ప్రత్యేక వాహనంలో మున్సిపల్‌ కార్యక్రమానికి ఉదయం 9 గంటలకు చేరుకున్నారు. ఈ సమావేశానికి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ కార్యక్రమాన్ని నడిపించారు. హాజరైన 36 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ఇదిలా ఉండగా ఆదోని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా శాంతను దించాలని గత నెలలో ఆదోనికి కౌన్సిల్‌ సభ్యులు కలెక్టర్‌ను కలసి అవిశ్వాసం ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మున్సిపల్‌ చెర్‌ పర్సన్‌ శాంత కోట్ల కూడలిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి చైర్‌పర్సన్‌ శాంతకు మద్దతుగా నిలబడ్డారు. వైసీపీ నుండి వచ్చిన వలస కౌన్సిల్‌ సభ్యులతో మాజీ ఎమ్మెల్యేను కౌన్సిల్‌ సభ్యులను తిట్టించారని, వైసీపీ కౌన్సెల్‌ సభ్యులు చైర్‌ పర్సన్‌ను దించడం కోసం లక్షల రూపాయలకు అమ్ముడు పోయారని ప్రచారం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి ఇంటికి కౌన్సిల్‌ సభ్యలందరూ చేరుకున్నారు. వైసీపీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి యుక్తులు, కుయుక్తులతో నియోజకవర్గంలో ఆబద్ధాలను ఊదరగొట్టుకుంటూ, ఎన్ని కుట్రలు పన్నినా వాటన్నిటిని అధిగమించి, అవిశ్వాసంతో బీజేపీ ముసుగులో ఉన్న చైర్‌ పర్సన్‌ను దించేశామన్నారు. నేటితో నియోజకవర్గంలో పార్థసారధి రాజకీయ పతనం, కూటమి ప్రభుత్వం పతనం ప్రారంభమైందని అన్నారు. ఎమ్మెల్యే తన ఓటు, చైర్‌ పర్సన్‌, బీజేపీలో చేరిన ఇంకో నలుగురు కూడా ఓటు వినియోగించుకోలేక ముఖం చూపించలేక ఉడాయించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, ఆదోని నియోజకవర్గ వైసీపీ సభ్యులు, చైర్‌ పర్సన్‌లు, వైసీపీ కౌన్సిల్‌ సభ్యులు, సర్పంచుల పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:56 AM