Share News

అన్నీ కాదు..ఒక్కటే..!

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:01 AM

అన్నీ కాదు..ఒక్కటే..!

అన్నీ కాదు..ఒక్కటే..!
19వ క్రస్ట్‌గేట్‌కు ఏర్పాటు చేస్తున్న స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ (ఫైల్‌)

తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్‌గేట్‌ ఏర్పాటుకు టెండర్లు పిలిచిన టీబీపీ బోర్డు

మొత్తం 33 గేట్లు మార్చాలని ఏకే బజాజ్‌ కమిటీ సూచనలు

అధ్యయనం పేరిట కాలయాపన

డ్యాం క్రస్ట్‌ గేట్ల సామర్థ్యంపై కేఎస్‌ఎన్‌డీటీ సంస్థ సర్వే

మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం

కర్నూలు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల జీవనాధారమైన తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్లలో అంతులేని జాప్యం జరుగుతోంది. గతేడాది ఆగస్టులో 19వ నంబరు క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు డ్యాం వద్దే మకాంవేసి స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల రైతుల కన్నీళ్లు తుడిచారు. డ్యాంను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ మొత్తం 33 గేట్లు మార్చాలని, వాటి స్థానంలో అత్యాధునిక డిజైన్‌తో నూతన గేట్లు ఏర్పాటు చేయాలని, అంతకుమందు క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించింది. నెలలు గడిచినా ఒక్క గేటు మాత్రమే ఏర్పాటు చేస్తారా..? మొత్తం అన్ని గేట్లు మారుస్తారా..? అన్న విషయంపై తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ అంశాలను ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఫిబ్రవరి 22న ‘గేటా.. గేట్లా..?! శీర్షికన అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై వెలుగులోకి తెచ్చింది. ఎట్టకేలకు కొట్టుకుపోయిన 19వ నంబరు గేటు మాత్రమే మార్చాలని టీబీపీ బోర్డు ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.2 కోట్లతో టెండర్లు పిలిచారు. జూన్‌ ఆఖరులోగా స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ తొలగించి నూతన క్రస్ట్‌గేటు ఏర్పాటు చేస్తామని తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ (ఎఫ్‌ఏసీ) నారాయణనాయక్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. కరువు, వలసలతో తల్లడిల్లే రాయలసీమ ప్రాంతం కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ప్రాణాధారం ఈ ప్రాజెక్టు. కర్నూలు జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీ కాలువకు డ్యాం నుంచి 24 టీఎంసీలు వాటా ఉంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, 195 గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన నీటివనరు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీబీపీ హెచ్చెల్సీ కాలువకు 32.50 టీఎంసీలు నీటి వాటా ఉంది. 2.85 లక్షల ఎకరాకలు సాగునీరు అందించాల్సి ఉంది. కేసీ కాలువకు 10 టీఎంసీలు నీటివాటా ఉంది. కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉంది. 1953 నుంచి రెండు రాష్ట్రాల నీటి ప్రయోజనాలు కాపాడుతున్న తుంగభద్ర డ్యాం 19వ నంబరు క్రస్ట్‌గేట్‌ గత ఏడాది ఆగస్టులో వరద ఉదృతికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని.. క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడును డ్యాంకు పంపించారు. టీబీపీ బోర్డు, కర్ణాటక, ఏపీ ఇంజనీర్లను సమన్వయం చేసుకుంటూ కన్నయ్యనాయుడు పది రోజులకు పైగా శ్రమించి ఎట్టకేలకు ‘స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌’ ఏర్పాటు చేశారు. వరద కడలిపాలు కాకుండా కాపాడిగలిగారు. తరువాత కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో డ్యాంను, గేట్లను పరిశీలించారు. గేట్ల జీవిత కాలం తీరిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయకుండా మొత్తం 33 గేట్లు మార్చాలంటూ పలు సూచనలతో అదే ఏడాది సెప్టెంబరులో నివేదిక ఇచ్చింది. అయితే గేట్ల సామర్థ్యంపై క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచన చేశారు. ఆ నివేదిక ఆధారంగా డిసెంబరు ఆఖరులోగా డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేయించాలని నవంబరులో జరిగిన టీబీపీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెలలు గడిచిపోతున్నా గేట్లు మార్చడంపై నిర్ణయం తీసుకోకుండా టీబీపీ బోర్డు అధికారులు జాప్యం చేస్తూ వస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

19వ గేటు ఏర్పాటుకు టెండర్లు

సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ కమిటీ మొత్తం 33 గేట్లు మార్చాలని, అందులో 11 గేట్లు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని, వాటిని తక్షణమే మార్చాలని సూచించారు. మొత్తం గేట్లు కాకుండా ఈ ఏడాది కేవలం కొట్టుకుపోయిన 19వ నంబరు గేటుకు ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ తొలగించి, ఆ స్థానంలో నూతన గేటు ఏర్పాటుకు దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు హెచ్‌డబ్ల్యూ అండ్‌ హెచ్చెల్సీ డివిజన్‌ ఇంజనీర్లు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచారు. ఈ నెల 11న ఆన్‌లైన్‌ టెండరు షెడ్యూల్‌ దాఖలుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత టెక్నికల్‌, ప్రైజ్‌ బిడ్‌లో ఓపన్‌ చేసి, అర్హత సాధించిన కాంట్రాక్ట్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని మే నెలలో పనులు మొదలు పెడతామని ఇంజనీర్లు తెలిపారు. రెండు నెలల గడువులోగా అంటే జూన్‌ ఆఖరులోగా కొత్త గేటు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే జూన్‌ ఆరంభంలో రుతుపవనాలు వచ్చి వర్షాలు కురిసి డ్యాంకు వరద పోటెత్తితే గేట్‌ ఏర్పాటు కష్టంగా మారుతుంది. ఆగస్టులో గేటు కొట్టుకు పోయింది. సెప్టెంబరులోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టి ఉంటే ఏప్రిల్‌ ఆఖరులోగా నూతన గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉండేది.

బోర్డు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద వచ్చే సమయానికి హడావుడిగా గేట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. జూన్‌ ఆఖరు వరకు గడువు ఇవ్వకుండా మే ఆఖరులోగా ఏర్పాటు చేస్తే.. జూన్‌లో వర్షాలు కురిసి వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆ దిశగా బోర్డు ఇంజనీర్లు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.

మూడు రోజుల్లో నివేదిక

నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచన మేరకు మొత్తం 33 క్రస్ట్‌గేట్ల సామర్థ్యంలో టీబీపీ బోర్డు అధికారులు అధ్యయనం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చీరాల కేంద్రంగా పని చేస్తున్న కేఎస్‌ఎన్‌డీటీ సంస్థ క్రస్ట్‌గేట్ల నిపుణులు బృందం దాదాపు 20 రోజులు మొత్తం గేట్లను క్షుణంగా తనిఖీ చేశారు. డ్యాం నిర్మాణం సమయంలో క్రస్ట్‌గేట్ల డిజైన్‌ మేరకు తయారి సమయంలో పొడవు, వెడల్పు, మందం, బరువు ఉండేది..? ఆ తరువాత గేట్లలో వచ్చిన మార్పులు, వరద ఒత్తిడికి గేట్లు మందం ఏమైనా తగ్గిందా..? ఇలా పలు సాంకేతిక కోణాల్లో క్రస్ట్‌గేట్స్‌ హెల్త్‌ చెకప్‌ చేశారు. రెండు, మూడు రోజుల్లో బోర్డుకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక రాగానే ఏపీ ప్రభుత్వం జలవనరులు సలహాదారుడు, క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడుతో చర్చించి మొత్తం గేట్ల ఏర్పాటుపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలకు నివేదిక పంపేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

డ్యాం 19వ గేటు ఏర్పాటు చేస్తున్నాం

గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటుకు ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ తొలగించి, ఆ స్థానంలో నూతన గేటు ఏర్పాటుకు దాదాపు రూ.2 కోట్లతో టెండర్లు పిలిచాం. జూన్‌ ఆఖరుగాలో గేటు ఏర్పాటు చేస్తాం. గేట్ల పరిస్థితి, సామర్థ్యాన్ని పరిశీలించిన కేఎస్‌ఎన్‌డీటీ సంస్థ నివేదిక ఇవ్వగానే క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడుతో చర్చించి మొత్తం గేట్ల ఏర్పాటుపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది.

- నారాయణనాయక్‌, తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ (ఎఫ్‌ఏసీ), హోస్పెట్‌

Updated Date - Apr 11 , 2025 | 12:02 AM