ఏకకాలంలో దాడులు
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:00 AM
నంద్యాల పట్టణానికి చెందిన ఓ రియల్టర్, అతడి సోదరుడితో పాటు మరో ఇద్దరికి(కుటుంబ సభ్యులు) చెందిన ఇళ్లు, వ్యాపార సముదాయాలపై బుధవారం పోలీసులు ఏకకాలంలో దాడుల చేశారు.
రియల్టర్ ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు
ఐదు బృందాలుగా విడిపోయిన పోలీసులు
బెంగుళూరు వాసి ఫిర్యాదుతో దాడులు
పలు రికార్డులు స్వాధీనం
నంద్యాల, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణానికి చెందిన ఓ రియల్టర్, అతడి సోదరుడితో పాటు మరో ఇద్దరికి(కుటుంబ సభ్యులు) చెందిన ఇళ్లు, వ్యాపార సముదాయాలపై బుధవారం పోలీసులు ఏకకాలంలో దాడుల చేశారు. ముందస్తుగానే పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి ఒకేసారి ఐదుచోట్ల మెరుపు దాడులు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్, కాటన్ వ్యాపారి బొగ్గారపు నాగరాజు, బెంగుళూరుకు చెందిన మరొక రియల్ వ్యాపారి ఇట్టిన మను ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు రకాల వ్యాపారాలు చేశారు. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఒకరికి ఒకరు దూరంగా ఉన్నారు. అయితే వారు కలిసి చేసిన రియల్‌ఎస్టేట్ తదితర వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీల సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల బొగ్గారపు నాగరాజు.. ఫేక్ డాక్యుమెంట్స్, పోర్జరీ సంతకాలు చేసి రూ. కోట్లలో అప్పులు సదరు రియల్డర్ మను ఇవ్వాల్సి ఉందని కోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి నోటీసులు రావడంతో మరో మను 20 రోజుల కిందట బొగ్గారపు నాగరాజు, అతని సోదరుడు బొగ్గారపు నాగప్రసాద్‌తో పాటు వారి కుటుంబ సభ్యులైన మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. కోర్టు వారెంట్‌తో కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అదేశాలకు మేరకు.. గురువారం నగరంలోని 1,2,3 టౌన్ పోలీసు స్టేషన్‌తో పాటు రూరల్ పోలీసులు కలిసి ఐదు బృందాలుగా విడిపోయి ఆయా ఇళ్లతో పాటు వారికి చెందిన వ్యాపార సంస్థలపై ఆకస్మికంగా మెరుపుదాడులు చేశారు.
ఐదు చోట్ల.. ఐదు బృందాలు..
నగరంలోని సీఐలు సుధాకర్‌రెడ్డి, ఇస్మాయిల్, కంబగిరి రాముడు, శ్రీనివాసరెడ్డి కలిసి ఐదు బృందాలుగా ఏర్పడి నగరంలోని బాలాజీ కాంప్లెక్స్, శ్రీనివాస్‌నగర్‌లోని ఇళ్లతో పాటు ఓ అపార్ట్‌మెంట్, లలిత కాటన్ మిల్, ఐశ్వర్య కాటన్ మిల్, సౌందర్య కాటన్ మిల్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా స్థానికంగా లేకపోవడం, ఇళ్లకు తాళం వేసి ఉండటంతో కోర్టు అదేశాలు మేరకు తాళాలు పగలకొట్టి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
అదేవిధంగా మరో ఇంటికి వెళ్తే.. ఆ ఇంటిని ఇతరులకు అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన కాటన్ మిల్లులో అక్కడ ఉన్న సిబ్బంది నేతృత్వంలో పోలీసులు ముమ్మర తనిఖీ చేసి పలు డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంట్‌కు చెందిన పుస్తకాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు పది గంటల పాటు పోలీసులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా బొగ్గారపు నాగరాజు, నాగప్రసాద్ మరో ఇద్దరు కూడా పథకం ప్రకారమే 15 రోజుల క్రితం నంద్యాల నుంచి వెళ్లినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇక్కడి వ్యవహారాలపై గుట్టుగా తెలుసుకుని తమ వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నట్లు తెలిసింది.
ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు
బొగ్గారపు నాగరాజు, మను కలిసి 2010 నుంచి రియల్ ఎస్టేట్ రంగం తో పాటు ఇతరత్రా వ్యాపారాలు చేశారు. వీరిద్దరి మద్య వందల రూ.కోట్ల లో లావాదేవీలు జరిగాయి. రెండేళ్లుగా ఇరువురి మద్య పలు రకాలుగా విభేదాలు రావడం.. ఆ తర్వాత ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లతో నాగరాజు కోర్టుకు వెళ్లడంతో విభేదాలు తార స్థాయికి చేరాయి. తనకు బెంగుళూరు చెందిన మను రూ.కోట్లలో అప్పు ఉన్నట్లు నాగరాజు కోర్టుకెళ్లారు. మరో వ్యాపారి మను వెంటనే అప్రమత్తమై కోర్టుకు వెళ్లి ఆ తర్వాత నంద్యాల త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కీలక రాజకీయ నాయకులతో పరిచయం, అండదండలు ఉన్నాయి. అందుకే పోలీసులు కూడా ఆచితూచి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.