Share News

సుజలం.. విఫలం

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:50 PM

జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి దాహం తీరడం లేదు.

సుజలం.. విఫలం
వెల్దుర్తిలో నిరుపయోగంగా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి యూనిట్‌

ఉమ్మడి జిల్లాలో 8 మండలాల్లో ‘ఎన్టీఆర్‌ సుజల స్రవంతి’ యూనిట్లు

వైసీపీ హయాంలో నిర్లక్ష్యం

అలంకారప్రాయంగా తాగునీటి పథకాలు

రూ.14.25 కోట్లు నీటిపాలు

కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే రూ.5లకే స్వచ్ఛ జలాలు

జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి దాహం తీరడం లేదు. బిందెడు నీటి కోసం పడుతున్న అవస్థలు ఎన్నో. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్‌ సమస్యతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఎనిమిది మండలాలను ఎంపిక చేసి.. 211 గ్రామాలకు ఫిల్టర్‌ చేసిన స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని రూ.14.25 కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎ్‌సఆర్‌ పేరు చేర్చారే తప్ప.. ప్రాణ జలం అందించే పథకాన్ని అటకెక్కించారు. రెండు మండలాల్లో అరకొరగా పని చేస్తున్నా.. మిగిలిన ఆరు మండలాల్లో ఈ పథకం వల్ల ప్రజల దాహం తీరడం లేదు. దీని కోసం ఖర్చు చేసిన రూ.కోట్ల ప్రజాధనం నిరర్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాల నిర్వహణపై దృష్టి సారించలేదనే విమర్శ వినిపిస్తోంది.

కర్నూలు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలోని కోడుమూరు, వెల్దుర్తి, కృష్ణగిరి, కౌతాళం, నందవరం, తుగ్గలి, నందికొట్కూరు, కొలిమిగుండల్ల మండలాల్లో 2018లో నాటి టీడీపీ టీడీపీ ప్రభుత్వం ఫ్లోరైడ్‌ సమస్యతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న 211 గ్రామాల్లో 3.50 లక్షల జనాభాకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమానికి నాంది పలికింది. ఒక మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఎంపిక చేసి ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద ఒక్కో క్లస్టర్‌కు రూ.3.06 కోట్లు మంజూరు చేసింది. భూగర్భ జలాలు పుష్కలంగా మండల కేంద్రం ప్రాంతంలో గంటకు 10 వేల లీటర్ల నీటిని ఫిల్టర్‌ మదర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. నీటిని శుద్ధి (ఫిల్టర్‌) చేసే యంత్ర సామగ్రి ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్‌ పరిధిలో ప్రతి పల్లెలో జనాభాకు అనుగుణంగా తాగునీరు అందించేందుకు వీలుగా ‘రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ (ఆర్‌డీయూ) ఏర్పాటు చేశారు. మదర్‌ ప్లాంట్‌ నుంచి ఆర్‌డీయూలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ఒక్కో క్లస్టర్‌కు నాలుగు ట్రాక్టర్లు, నీటి ట్యాంకులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఒక్కో క్లస్టర్‌కు రూ.1.25 కోట్ల నుంచి రూ.2.50 కోట్లు చొప్పున రూ.14.25 కోట్లు ఖర్చు చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు పూర్తి చేశారు. రూ.కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన తాగునీటి ప్లాంట్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ట్రాక్టర్లు, ట్యాంకర్లు వినియోగం లేక తుప్పు పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ హయాంలో అటకెక్కించారు

ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ఆర్‌డీయూ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ట్యాంకులో ఫిల్టర్‌ నీటిని నింపుతారు. నీళ్లు కావాల్సిన వాళ్లు రూ.5 కాయిన్‌ వేస్తే 20 లీటర్లు ఫిల్టర్‌ నీరు బిందెలో పడేలా టెక్నాలజీ అనుసంధానం చేశారు. దశాబ్దాలుగా వెంటాడుతున్న ఫ్లోరైడ్‌ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశిస్తే.. 2019 మేలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఫ్లోరైడ్‌ పీడిత ప్రజల ఆశలపై నీళ్లు చల్లింంది. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాన్ని వైఎ్‌సఆర్‌ సుజల స్రవంతి పథకంగా పేరు మార్చేరే తప్ప నిర్వహణను గాలికొదిలేశారు. కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి తీసుకొచ్చి అటకెక్కించారు. వీటి నిర్వహణ కాంట్రాక్టర్లకు వైసీపీ హయాంలో సకాలంలో నిర్వహణ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో చేతులెత్తేశారు. కౌతాళం, నందవరం, కొలిమిగుండ్ల మండలాల్లో మాత్రం కొన్ని గ్రామాలకు ఫిల్టర్‌ నీటిని అందిస్తున్నామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు

తుగ్గలి మండలం ఉప్పర్లపల్లెలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి మదర్‌ ప్లాంట్‌, 14 గ్రామాల్లో 26 రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ (ఆర్‌డీయూ) ఏర్పాటు చేశారు. మదర్‌ ప్లాంట్‌ నుంచి ఆర్‌డీయూలకు నీటిని సరఫరా చేసేందుకు నాలుగు ట్రాక్టర్లు, ట్యాంకులు కొనుగోలు చేశారు. ఒక్కో ట్రాక్టరు, ట్యాంకర్‌కు రూ.6.50 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. మొత్తం యూనిట్‌కు రూ.1.24 కోట్లు వెచ్చించారు. నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారడంతో ట్రాక్టర్ల టైర్లు పనికిరాకుండా పోయాయి. ట్యాంకర్లు తుప్పు పడుతున్నాయి. కరెంట్‌ బిల్లులే రూ.24 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ ప్లాంట్‌ వినియోగంలోకి తీసుకురావాలంటే కరెంట్‌ బిల్లులుతో పాటు మరమ్మతులకు రూ.36 లక్షలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. తుగ్గలి నీటి పథకం ఒక్కటే కాదు.. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. కోడుమూరు పట్టణంలో ఆర్‌డీయూలు చెత్త కేంద్రాలుగా మారాయి.

దృష్టి సారిస్తే శుద్ధ జలం

మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు గ్రామాల్లో ప్రైవేటు ఆర్‌ఓ ప్లాంట్‌ యజమానులు రూ.10-12లకు 20 లీటర్లు నీటిని ఇంటింటికి సరఫరా చేస్తుండడంతో రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ (ఆర్‌డీయూ)కు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి నిర్వహణ బాధ్యతను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించి, 20-25 లీటర్ల క్యాన్‌కు రూ.8 ధర నిర్ణయించడంతో పాటు ఇంటింటికి సరఫరా చేయాలి. లేదంటే.. ప్రభుత్వమే విద్యుత్‌ బిల్లులు, నిర్వహణ ఖర్చులు, నిర్వహణ సిబ్బందిని నియమించి నెలనెల గౌరవ వేతనాలు చెల్లించి ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని, అప్పుడే లక్ష్యం సఫలం అవుతుంది. లేదంటే.. సు‘జలం’.. నిష్పలమే అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

పంచాయతీలకు అప్పగించాం

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 8 మండలాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావిత 211 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద మధర్‌ ఫిల్టర్‌ యూనిట్లు, గ్రామాల్లో రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశాం. వీటి కోసం రూ.14.25 కోట్లు ఖర్చు చేశాం. నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామ పంచాయతీలకు అప్పగించాం. ప్రస్తుతం నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్న మాట నిజమే. రెండు మూడు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.

- నాగేశ్వరరావు, ఎస్‌ఈ (ఎఫ్‌ఏసీ), గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, కర్నూలు

Updated Date - Apr 24 , 2025 | 11:50 PM