పశువులకు ‘సూపర్’ వైద్యం
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:04 AM
కర్నూలు జిల్లాలో 2017 సంవత్సరంలో జనవరి 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.5.40 కోట్లతో నాలుగు అంతస్థుల భవనాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతులు తమ జీవాలకు అధునాతన చికిత్స ఇక్కడ చేయిస్తున్నారు.
5.40 కోట్లతో నాలుగంతుస్తుల భవనం
2017 జనవరి 2న టీడీపీ హయాంలో ప్రారంభం
నేటి వరకు వేల సంఖ్యలో వైద్యచికిత్సలు
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో 2017 సంవత్సరంలో జనవరి 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.5.40 కోట్లతో నాలుగు అంతస్థుల భవనాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతులు తమ జీవాలకు అధునాతన చికిత్స ఇక్కడ చేయిస్తున్నారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో మూగజీవాలకు అత్యున్నతమైన చికిత్సను అందించేందు కోసం టీడీపీ ప్రభుత్వం నాలుగు అంతస్థుల భవనాన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసింది. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 100 నుంచి 150 దాకా పశువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులకు డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎక్స్‌రే ప్లాంటును ఏర్పాటు చేయడం ఈ ప్రాంత రైతుల అదృష్టమనే చెప్పాలి. పశువులకు, ఇతర జీవాలకు ఇక్కడ అధునాతన వైద్యం అందిస్తున్నారు. మందుల కొరత లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. రోజూ పెంపుడు జంతువులు, కోడెద్దులు, గొర్రెలు, మేకలు, తదితర జీవాలతో ఈ హాస్పిటల్ ఎంతో కళకళలాడుతుండటం విశేషం. ప్రతి రోజు పెంపుడు కుక్కలకు ర్యాబిస్ నివారణకు ఖరీదైన వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. ఈ హాస్పిటల్‌లో ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కలిగిన వైద్యుడితో పాటు మరో ఇద్దరు అడిషనల్ డైరెక్టర్లు ఐదుగురు డాక్టర్లు ఇతర సిబ్బంది మరో 50 మంది ఉన్నారు. కోళ్లకు వారానికి ఒకసారి ఉచితంగా టీకాలను అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 3.62 లక్షల ఆవులు, 14.08 లక్షల మేకలు, గొర్రెలు, 5.85 లక్షల కోళ్లు, మరో 20వేల దాకా ఇతర పశుసంపద ఉన్నట్లు డాక్టర్లు చెబుతు న్నారు. నంద్యాల జిల్లాలో 4.14 లక్షల ఆవులు, 11.89 లక్షల మేకలు, గొర్రెలు, 7.05 లక్షల కోళ్లు, ఉన్నాయి. వీటికి ఈ హాస్పిట ల్‌లో వైద్యాన్ని అందించేందుకు వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
సూపర్ స్పెషాలిటీ సేవలు
రాష్ట్రంలోనే ఉత్తమ వెటర్నరీ పాలి క్లీనిక్ హాస్పిటల్‌గా కర్నూలు నగరంలోని మూగ జీవాల కోసం ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ ప్రతిరోజు 100 నుంచి 150 మూగజీవాలకు వైద్యాన్ని అందిస్తూ రైతుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో డాక్టర్లు, సిబ్బంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు నగరంలోని ఈ హాస్పెటల్‌లో 24 గంటలు డాక్టర్లు, సిబ్బంది అందుబా టులో ఉంటారు. మూగజీవాలకు ఎలాం టి అనారోగ్యం సంభవించినా ఇక్కడికి వస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా పశువులను ఇక్కడకు చికిత్స కోసం తీసుకువస్తు న్నారు. ఈ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్‌గా పశువులకు సేవలందిం చేందుకు కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీ తదితర ప్రత్యేక నిర్మా ణాలు చేపట్టాల్సి వుంది. - డా. హేమంత్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్
పదేళ్ల నుంచి ఇక్కడే చికిత్స
దాదాపు 10 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్‌లోనే మా పెంపుడు జంతువు కుక్కకు వైద్యచికిత్సను తీసుకుంటున్నాం. దాదాపు 5 కి.మీల దూరంలో ఉన్న శిల్పటౌన్‌షిప్ కాలనీ నుంచి ఇక్కడకు వైద్యచికిత్స కోసం వస్తున్నాం. డాక్టర్లు ఎంతో శ్రద్ధ తీసుకుం టున్నారు. - కులదీప్, శిల్ప టౌన్‌షిప్, కర్నూలు.