టెన్షన్..టెన్షన్..!
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:27 PM
పరీక్షలు పూర్తయిన 20 రోజులకే అత్యంత వేగంగా ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల
ఎదురుచూస్తున్న 29,092 మంది విద్యార్థులు
ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేనా..?
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పరీక్షలు పూర్తయిన 20 రోజులకే అత్యంత వేగంగా ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే మూల్యాంకనం, రీ వెరిఫికేషన్, కంప్యూటరీకరణ తదితర ప్రక్రియలను చేపట్టి ఫలితాల విడుదల సిద్ధమయ్యారు. జిల్లాలో ఈ ఏడాది 15,692 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 13,400 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వారందరూ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారిక వైబ్‌సైట్‌తో పాటు ఇటీవల ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉత్తీర్ణత శాతం పెరిగేనా...?
2023-24 విద్యాసంవత్సరంలో నంద్యాల జిల్లాలో 12,022 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 7,102 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే 9,165 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 6,429 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 56 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా 13వ స్థానంలో నిలిచింది. 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 45.56 శాతం, ద్వితీయ సంవ త్సరం విద్యార్థులు 64.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. 57 ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 59.89 శాతం, ద్వితీయ సంవ త్సరం విద్యార్థులు 68.99 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యరు. 19 మోడల్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 60.44 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72.67 శాతం ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా గతేడాది జిల్లాలోని 24 ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 60.04 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంమీద ఈ ఏడాది జిల్లాలో మరింత ఉత్తీర్ణత శాతం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మన మిత్ర ద్వారా ఇలా..
స్టెప్ 1: ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపాలి.
స్టెప్ 2: ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్‌లో విద్యాసేవలు ఎంచుకోవాలి.
స్టెప్ 3: డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు-2025 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మార్కుల మెమో పొందడానికి మీ హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
స్టెప్ 5: పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.