అకాల వర్షం..అపార నష్టం
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:54 AM
మండలంలోని మేళిగనూరు, నదిచాగి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
కౌతాళం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని మేళిగనూరు, నదిచాగి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అకాలవర్షానికి వరి రైతులకు అపారనష్టం కలిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి చేతికి వచ్చిన వరి పంట నేలపాలైంది. ఇప్పటికే కోసిన వరిపంటను కల్లాల్లో ఆరబెట్టగా ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసి ముద్దాయినది. దీంతో రైతన్నలకు అపార నష్టం కలిగించింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వరి రైతులు కోరుతున్నారు.
కోసిగిలో దంచి కొట్టిన వాన
కోసిగి: మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు, మూడు రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు ఆదివారం మధ్యా హ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకు న్నాయి. మేఘాలు కమ్ముకోవడంతో సుమారు అరగంట పాటు వర్షం పడింది. కోసిగి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుపై వర్షం నీరు చేరడంతో కుంటను తలపించింది. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం సమీ పంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదోని వెళ్లే ప్రధాన రోడ్డుపై వర్షం నీరు పొంగి పొర్లాయి. వారం రోజులుగా కోసిగిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ వేడిమికి అల్లాడిపోయిన ప్రజలకు ఆదివారం కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది.
గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లతో పాటు గాజులదిన్నె, హెచ కైరవాడి, అలువాల, కులుమాల గ్రామాల్లో ఆదివారం మధ్యా హ్నం ఉరుములు, మెరుపుతో కూడిన ఒక మోస్తారు వర్షం కురిసింది. గోనెగండ్ల పలు వీధుల్లో వర్షపునీరు పారడంతో జనానికి ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలిగింది. రెండు మూడు రోజులు వాతా వరణం చల్లగా ఉంటుందని ప్రజలు తెలుపుతున్నారు.