Share News

Venkaiah Naidu : భాష పోతే శ్వాస పోయినట్టే!

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:08 AM

ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలనా వ్యవహారాలు, ఉత్తర్వులు, ఆదేశాలు తెలుగులోనే ఉండాలని సూచించారు.

Venkaiah Naidu : భాష పోతే శ్వాస పోయినట్టే!

పాలనంతా తెలుగులోనే జరపాలి

వెంకయ్యనాయుడు పిలుపు

జీజీయూలో ప్రపంచ తెలుగు మహాసభలు

రాజమహేంద్రవరం/రాజానగరం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలనా వ్యవహారాలు, ఉత్తర్వులు, ఆదేశాలు తెలుగులోనే ఉండాలని సూచించారు. రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలో ఉన్న గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ(జీజీయూ)లో చాన్సలర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అధ్యక్షతన రెండో ప్రపంచ తెలుగు మహాసభలను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, ప్రసంగించారు. ‘రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఓట్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ భాషకు విలువ ఇవ్వట్లేదు. భాష పోతే శ్వాస పోయినట్టే. తెలుగు భాష రానివాడు తెలుగోడే కాడు. తెలుగు మాట్లాడే వాడికే ఓటేయాలి. తెలుగు రానివాళ్లను ఇంటికి సాగనంపాలి. తెలుగు రాష్ట్రంలో పుట్టి ఇంగ్లిష్‌ మాట్లాడటం అంటువ్యాధిలా మారింది.. ఆంగ్లంపై వ్యామోహం తగ్గించుకుని అమ్మభాషను కాపాడుకోవాలి.తెలుగు భాషలో అక్షరాన్ని మార్చకుండానే పదవిన్యాసం చేయవచ్చు. మీసం గతేంటో.. అనే వాక్యాన్ని మీ సంగతేంటో.. అని కూడా మలచవచ్చు. మాటమాటా పెరిగింది అనే వాక్యాన్ని మా టమాటా పెరిగిందనీ రాయవచ్చు. ఇంటి పేర్లు కూడా పూర్తిగా రాయకుండా ఇంగ్లీషు అక్షరాలు పెడుతున్నారు. ఎన్టీఆర్‌ తెలుగు భాషకు జీవం పోశారు. ఆయన తెలుగులోనే మాట్లాడేవారు. సినీ రచయితలు సంభాషణలు, పాటలు తెలుగులోనే రాయాలి’ అని కోరారు.

తెలుగు మాధ్యమం ప్రవేశపెడితేనే..

‘తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్‌ పదవి స్వీకరించమని సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి అడిగారు. రెండు షరతులు పెట్టాను. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగు మాధ్యమమే ఉండాలని, ఎల్‌కేజీలు, యుకేజీలు పీకేయాలని ఒక షరతు... డిగ్రీ వరకూ తెలుగును ప్రథమ భాషగా చేయాలనేది రెండోది. ఈ సంభాషణ జరిగి 2నెలలయింది. భాషకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎవరు అధికార భాషా సంఘం చైర్మన్‌ అయినా ఫలితం ఉండదు. ఇటీవల వారం వారం తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. వాటిల్లో తప్ప ప్రజల్లో తెలుగు కనిపించడం లేదు. ఓట్లు కావాలంటే తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని అమ్మలు, మహిళలంతా డిమాండ్‌ చేయాలి’ అని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తన ప్రసంగంలో సూచించారు.

బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడూ తీసుకోడు

‘ఒకటి నుంచి 5వ తరగతి వరకూ తెలుగు మాధ్యమం అమలు చేస్తేనే పదవి చేపడతానని గరికపాటి స్పష్టం చేసిన తర్వాత అవి అమలు కాకుండా బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడూ ఆ పదవి చేపట్టలేరు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని అణచివేసినప్పుడు కవులు, రచయితలు ముందుకు రావాలని ప్రతిపక్షం పిలుపునిస్తుంది. అధికారంలోకి వచ్చాక ఇదీ ఆ పనే చేస్తుంది’ అని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సందర్భంగా ఆక్షేపించారు. తెలుగు మాట్లాడేవాడే వేదపండితుడన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 05:08 AM