Leopard Dies in Trap Two Cubs Lost: ఉచ్చులో చిక్కి చిరుత మృతి
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:27 AM
మదనపల్లె మండలంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న చిరుతపులి, 10 గంటలపాటు నరకయాతన అనుభవించి మృతి చెందింది. గర్భంలో ఉన్న రెండు పిల్లలతో ఆ చిరుత మరణించింది
నడుముకు ఉచ్చు బిగుసుకుపోవడంతో.. గ్రామస్థులు, అటవీశాఖ అధికారుల కళ్లెదుటే మృతి
చిరుత గర్భంలోనే రెండు కూనలూ కన్నుమూత
మదనపల్లె టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): నిండు గర్భంతో ఉన్న చిరుతపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిల్లాడింది. భీకరంగా అరుస్తూ పది గంటలపాటు నరకయాతన అనుభవించింది. నడుముకు ఉచ్చు బిగుసుకుపోవడంతో ఊపిరాడక కొట్టుమిట్టాడింది. చివరకు శరీరంలోని శక్తి సన్నగిల్లి, ఎండకు సొమ్మసిల్లి.. అటవీశాఖ అధికారులు, గ్రామస్థులు కళ్లెదుటే ప్రాణాలు విడిచింది. దీంతో దాని కడుపులో ఉన్న రెండు పిల్లలు కూడా కన్నుమూశాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలం పొన్నేటిగ్రామం సమీపంలో బుధవారం తెల్లవారుజామున పులి అరుపులు విన్న కొందరు గ్రామస్తులు అటువెళ్లి చూడగా.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న చిరుత కనిపించింది. దీంతో ఉదయం 8 గంటలకు వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సబ్ డీఎ్‌ఫవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎఫ్‌ఆర్‌వో జయప్రసాదరావు, డీఆర్‌వో మదనమోహన్ సంఘటనా స్థలానికి వచ్చి చిరుతను పరిశీలించారు. దాన్ని బంధించడానికి అటవీశాఖ వద్ద వలలు లేకపోవడంతో వాలీబాల్ నెట్‌లు తీసుకొచ్చారు.
చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల కోసం గంట పాటు ఎదురుచూసారు. తీరా అనుమతి వచ్చాక తుపాకిలో ఇంజెక్షన్ పెట్టి పేల్చగా అవి పేలలేదు. దీంతో తిరుపతి జూపార్కు నుంచి ట్వాంకిలైజర్స్ గన్‌లు తీసుకురావాలని పై అధికారులను కోరారు. ఈలోగా గ్రామస్తులు చిరుతను కాపాడేందుకు ప్రయత్నించగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. సొమ్మసిల్లిన చిరుతకు తాగునీరు అందించడానికి కూడా నిరాకరించారు.చివరకు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చిరుత సొమ్మసిల్లి అచేతనంగా పడిపోయింది. అధికారులు దగ్గరకు వెళ్లి చూడగా అది మృతిచెందింది.
చిరుత కడుపులో పిల్లలు
ఆరేళ్ల వయసున్న ఈ ఆడ చిరుత గర్భంతో ఉన్నట్లు పశువైద్యాధికారులు డాక్టర్ ప్రసాదరెడ్డి, లారెన్స్ స్థానిక పశువైద్యశాలలో నిర్వహించిన పోస్టుమార్టంలో బయటపడింది. చిరుత కడుపులో రెండు మగ పిల్లలు కనిపించాయి. మరో 20 రోజుల్లో తల్లి గర్భం నుంచి బయట పడేవని డాక్టర్ రోహిణి వెల్లడించారు. చిరుత కళేబరంతో పాటు, దాని పిల్లలను కూడా అధికారులు దహనం చేశారు.