Share News

Makar Sankranti 2025: సంక్రాంతి ప్రత్యేకత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? పూజా కార్యక్రమాలు..

ABN , Publish Date - Jan 14 , 2025 | 09:43 AM

Makar Sankranti 2025: తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ వచ్చేసింది. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, చుట్టాల సందడి, ముగ్గుల హోరు, పతంగుల జోరుతో పండుగ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకోనుంది.

Makar Sankranti 2025: సంక్రాంతి ప్రత్యేకత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? పూజా కార్యక్రమాలు..
Sankranthi Celebrations

తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ వచ్చేసింది. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, చుట్టాల సందడి, ముగ్గుల హోరు, పతంగుల జోరుతో పండుగ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకోనుంది. అయితే సంక్రాంతి పండుగ అంటే ఒక్క రోజు పండుగ కాదు. ఇది నాల్రోజుల పాటు ఉండే బిగ్ ఫెస్టివల్. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా 4 రోజుల పాటు పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు సంక్రాంతి అంటే ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? ఆ రోజు జరిపే పూజా కార్యక్రమాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


ఒక్కో చోట ఒక్కోలా..!

హిందూ మతంలో మకర సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. సూర్య భగవానుడు 12 రాశుల పర్యటనలో భాగంగా మకర రాశిలోకి ప్రవేశించే నాడు ఈ పండుగ జరుపుకుంటారు. మన దేశంలో ప్రాంతాలను బట్టి మకర సంక్రాంతికి భిన్నమైన పేర్లు ఉన్నాయి. సంక్రాంతితో పాటు లోహ్రా, తెహ్రీ, పొంగల్ లాంటి పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. ఈ పండుగ రోజులలో నదుల్లో పవిత్ర స్నానాలు, దానధర్మాలు చేస్తుంటారు. మకర సంక్రాంతి నాడు సూర్యుడికి నీళ్లు, ఎరుపు పువ్వులు, గోధుమలు, తమలపాకులు, ఎరుపు బట్టలు లాంటివి సమర్పిస్తారు.


పూజా విధానం

ఈ ఏడాది సంక్రాంతి విషయానికొస్తే.. పండుగను జనవరి 14, మంగళవారం నాడు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉదయం 7.15 నుంచి సాయంత్రం 5.46 వరకు పూజకు అనుకూల సమయమని అంటున్నారు. అయితే పొద్దున 7.15 నుంచి 9 గంటల వరకు దివ్య ముహూర్తంగా చెబుతున్నారు. సంక్రాంతి పూజా విధానం విషయానికొస్తే.. ఆ రోజు ఇంటి మెుత్తాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. ఆ తర్వాత దేవతామూర్తుల ఫొటోలతో పాటు పెద్దల ఫోటోల ముందు పూజలు చేస్తారు. పండ్లు, మిఠాయిలతో పాటు పిండి వంటలను నైవేద్యంగా పెడతారు. అనంతరం మంత్రాలు పఠిస్తూ దేవతారాధన చేస్తారు.


ప్రసాదం

సంక్రాంతి పండుగ నాడు పొంగలి వండి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పరమాన్నం, పులిహోర, బూరెలు, గారెలతో పాటు అటుకుల బెల్లం లాంటివి ప్రసాదంగా పెడుతుంటారు. సకినాలు, మురుకులు, జంతికలు వంటివి కూడా ఇష్టంగా దేవుళ్లకు సమర్పిస్తుంటారు. ఇలా పండక్కి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వంటలు వండుతుంటారు. మొత్తానికి పూజలు చేసే సమయంలో పిండి వంటలు, పండ్లు, తీపి పదార్థాలు లాంటివి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 14 , 2025 | 09:43 AM