Share News

Anam Ramanarayana Reddy: డబ్బులిచ్చి చంద్రబాబును తిట్టించారు

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:17 AM

తిరుపతి దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు జగన్‌ ఆసుపత్రిలోకి అడుగు పెట్టకముందే ఆయన వెంట ఉండే దుష్టచతుష్టయాల్లో ఒకరు లోపలికి ప్రవేశించారని, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడమని 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

 Anam Ramanarayana Reddy: డబ్బులిచ్చి చంద్రబాబును తిట్టించారు

జగన్‌ మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు

ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి

జగన్‌, అనుచరులు శవాల మీద పేలాలు

ఏరుకునే రాజకీయం చేశారు: మంత్రి ఆనం

నెల్లూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు జగన్‌ ఆసుపత్రిలోకి అడుగు పెట్టకముందే ఆయన వెంట ఉండే దుష్టచతుష్టయాల్లో ఒకరు లోపలికి ప్రవేశించారని, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడమని 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయన్నారు. ఇంత నీచానికి దిగజారడానికి సిగ్గులేదా? అని ఘాటుగా విమర్శించారు. జగన్‌, ఆయన అనుచరగణం తిరుపతి లో శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేశారని, వాళ్లు మనుషులేనా? అని మండిపడ్డారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన జగన్‌ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదు. ‘అయ్యా.. ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు.. ఒక్క 15 నిమిషాలు ఆగండి.. ఆయన వెళ్లిన తరువాత మిమ్మల్ని అనుమతిస్తామని పోలీసులు ప్రాధేయపడినా జగన్‌, ఆయన అనుచరులు వినలేదు. పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఆసుపత్రిలోకి దూరారు. వీరి ప్రవర్తనకు ఆసుపత్రి వర్గాలు, రోగులు భయబ్రాంతులకు గురయ్యారు. సెలైన్‌ స్టాండ్లు కింద పడిపోయాయి.

బాధితులను పరామర్శించే పద్ధతా ఇది? ఆసుపత్రి వద్ద పరామర్శకు వచ్చిన నాయకుడు ఎలా ఉండాలి.. ఈయన వెంట వచ్చిన జనం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ ఉన్న పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నినాదాలు చేయడానికి ప్రయత్నించారు. కానీ పవన్‌ నినాదాలు ఆపించారు. కానీ జగన్‌ ఆపమని చెప్పలేదు. ఇంకా రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని ఆసుపత్రిలో పరామర్శలకు వెళ్లారు. జగన్‌ మాత్రం వందల మందిని పోగేసుకొని ఆసుపత్రిలోకి జొరబడ్డారు. గాయపడిన వారు ఐసీయూలో ఉన్నారు. అక్కడికి వందల మందిని వెంటబెట్టుకొని వెళ్లారు. ఐసీయూ నిబంధనలు ఏమిటో జగన్‌కు తెలియదా? ప్రజలు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పినా జగన్‌లో ఇంకా మార్పు రాలేదు. వైసీపీ నేతలకు సనాతన ధర్మం తెలియదు. ఆగమ శాస్త్రాల నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. వేదపండితులను మరచిపోయారు. నిగమ, ఆగమ సాంప్రదాయాలు మరిచిపోయారు. చివరికి తిరుపతిలో జరిగిన దురదృష్టకర సంఘటనను తన రాజకీయానికి అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించారు. ఇంత నీచంగా వ్యవహరించడానికి సిగ్గులేదా?ఏం సంస్కృతి మీది? మృగాల మధ్య బతకాల్సినవారు జనంలో తిరుగుతున్నారు’’ అని ఆనం దుయ్యపట్టారు.

Updated Date - Jan 11 , 2025 | 04:17 AM