Building Permits: ‘రియల్’ బూమ్ కోసం సడలింపులు
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:21 AM
రాష్ట్రంలో భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు ఊపందుకొనేలా అనుమతుల్లో అనేక సడలింపులు తీసుకొచ్చామని మునిసిపల్ మంత్రి నారాయణ అన్నారు.
ఎన్‌బీసీకి అనుగుణంగా విధానాలు: మంత్రి నారాయణ
గుంటూరు, అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు ఊపందుకొనేలా అనుమతుల్లో అనేక సడలింపులు తీసుకొచ్చామని మునిసిపల్ మంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం గుంటూరులో ప్రారంభమైన నరెడ్కో ప్రాపర్టీ షోలో సడలింపులను వివరించారు. ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం నాశనం అయింది. రియల్ ఎస్టేట్ పటిష్ఠంగా అభివృద్ధి చెందాలని సీఎం నాకు చెప్పారు. బిల్డ ర్లు, రియాల్టర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్, కేంద్ర ప్రభుత్వ మోడల్ బిల్డింగ్ బైలా్‌సకు అనుగుణంగా ఉత్తమ విధానాల అమలు చేస్తాం’ అని అన్నారు.
గేటెడ్ కమ్యూనిటీలకి సంబంఽధించి విధివిధానాలు సరిగా లేవని బిల్డర్లు చెప్పారు. దానికి సంబంధించి గ్రూప్ డెవల్‌పమెంట్ స్కీమ్‌కి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటినే అమలు చేస్తాం.
రైల్వే, రక్షణ శాఖ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోనిదే బిల్డంగ్ ప్లాన్ ఇవ్వరు. దానికి కూడా మార్పులు చేశాం. వాళ్ల నిబంధనలకు అనుగుణంగా బిల్డింగ్ ప్లాన్ పెడితే మునిసిపల్ శాఖ అనుమతులు ఇస్తుంది. ఎలాంటి ఎన్‌వోసీలు తెచ్చుకోవాల్సిన పని లేదు.
అదే విధంగా 500 మీటర్ల పైన ఉన్న రెసిడెన్సియల్ బిల్డింగ్స్‌కు సెల్లార్ పర్మిషన్ ఇస్తాం.
55 నుంచి 75 మీటర్ల వరకు అయితే 17 మీటర్ల సెట్ బ్యాక్, 75 నుంచి 120 మీటర్ల లోపు అయితే 18 మీటర్లు, 120 మీటర్లు దాటితే 20 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలి.
10 అంతస్తులు దాటిన భవనాలకు ఒక ఫ్లోర్ ఎక్స్‌ట్రాగా ఇస్తున్నాం. దానిని గార్డెన్, గ్రీనరీ, స్పాకి వినియోగించుకోవచ్చు.
రోడ్ల విస్తరణలో టీడీఆర్ బాండ్ లేకుండానే ఎంత స్థలం అయితే పోతుందో దానికి సమానంగా అంతస్తు నిర్మించుకోవచ్చు.
4 వేల చదరపు మీటర్ల కలిగిన గ్రూపు డెవల్‌పమెంట్ చేసేటప్పుడు 10 శాతం ఓపెన్ స్పేస్ వదలాలి. దీనికి అదనంగా స్విమ్మింగ్ పూల్‌కి స్థలం చూపించాలి. అయితే ఓపెన్ స్పేస్ 10 శాతంలో.. 15 శాతం లోపల స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు.
పౌల్ర్టీ ఫాంలు అగ్రికల్చర్ జోన్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
టీడీఆర్ బాండ్లను ఖరారు చేయడానికి కొత్త జీవోలో మునిసిపల్ కమిషనర్, ఆర్‌డీడీ టౌన్‌ప్లానింగ్, యూఎల్‌బీలో రెవెన్యూ అధికారిని చేర్చాం. ఇక బాండ్ల ప్రక్రియ సులభతరం అయింది.
5 అంతస్తుల లోపల బిల్డింగ్స్‌కి సెల్ఫ్ డిక్లరేషన్‌తో పర్మిషన్లు.