Share News

Alcohol-Free State: ఐదు దశల్లో నవోదయం 2.0

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:19 AM

రాష్ర్టాన్ని సారా రహితంగా మార్చేందుకు ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రారంభించింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సారాపై నవోదయం పేరుతో సారా నిర్మూల న కార్యక్రమం అమలు చేయగా, ఇప్పుడు నవోదయం 2.0 పేరుతో మళ్లీ కార్యక్రమాన్ని అమలుచేయబోతోంది.

Alcohol-Free State: ఐదు దశల్లో నవోదయం 2.0

ఆరు నెలల్లో సారా రహిత రాష్ట్రం

షెడ్యూలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ర్టాన్ని సారా రహితంగా మార్చేందుకు ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రారంభించింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సారాపై నవోదయం పేరుతో సారా నిర్మూల న కార్యక్రమం అమలు చేయగా, ఇప్పుడు నవోదయం 2.0 పేరుతో మళ్లీ కార్యక్రమాన్ని అమలుచేయబోతోంది. నవోదయం 2.0 కార్యక్రమం షెడ్యూలు ఖరారు చేస్తూ ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా శుక్రవా రం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం ఐదు దశల్లో ఈ కార్యక్రమం అమలుచేస్తారు. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రజల్లో అవగాహన

మొదటి దశలో సారా ప్రభావిత గ్రామాలను సందర్శించి గ్రామ సభలు నిర్వహిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేసి సారా దుష్ప్రరిణామాలను వివరిస్తారు. సారాపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు. అలాగే బెల్లం ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించి నాటుసారాకు బెల్లం సరఫరా చేయొద్దని కోరతారు. 14405 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేస్తారు. ఈ దశ రెండు నెలల పాటు ఉంటుంది.

సారా స్థావరాలపై దాడులు

రెండో దశలో నాటుసారా స్థావరాలు, గుర్తించిన గ్రామాలపై దాడులు నిర్వహిస్తారు. సారా, బెల్లం ఊటను ధ్వంసం చేస్తారు. ప్రతి కేసులో పట్టుబడినవారితో పాటు వెనుక ఎవరున్నారు? అనేది వెలికితీసే ప్రయత్నం చేస్తారు. దారులు లేని, వెళ్లలేని గ్రామాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. ఎక్కడైనా భారీగా బెల్లం అమ్మితే వాటిపై నిఘా పెడతారు. సారాకు బెల్లం సరఫరా చేసే వ్యాపారులనూ బాధ్యులను చేస్తారు. కేవలం సారా అమ్మకాలు చేసే గ్రామాల్లో రవాణా చేసే వారిని ఈ కేసులకు బాధ్యులుగా చేరుస్తారు. ఈ దశ రెండు నెలలు ఉంటుంది.

ప్రత్యామ్నాయ జీవనోపాధి

సారా రహితంగా మార్చిన గ్రామాల్లో తదుపరి చర్యలు ప్రారంభిస్తారు. భవిష్యత్తులోనూ సారా తయారుచేయకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచున్నారు. మళ్లీ గ్రామ సభలు నిర్వహించి సారా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. జిల్లా కలెక్టర్‌ సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిపై పథకాలు అమలుచేస్తారు. నైపుణ్య శిక్షణ, చిన్న స్థాయి వ్యక్తిగత, గ్రూపు వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రెండు నెలల కాల వ్యవధిలో ఈ కార్యక్రమాలు పూర్తిచేస్తారు.

సారా రహిత గ్రామాలుగా ప్రకటన

కనీసం రెండు నెలలపాటు ఒక్క సారా కేసు కూడా నమోదుకాని గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటిస్తారు. ఐదో నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిపై గ్రామసభ నిర్వహించి ప్రజలు, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారుల సమక్షంలో తీర్మానం చేస్తారు. గ్రామాలను సారా రహితంగా ప్రకటించిన తర్వాత జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటిస్తారు. ఇక, ఆర్నెల్ల కాలంలో రాష్ర్టాన్ని సారా రహితంగా ప్రకటించి, ఆ తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తారు.

Updated Date - Jan 11 , 2025 | 03:19 AM