NIT AP Seat Cut: ఏపీ నిట్‌కు మళ్లీ 480 సీట్లే
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:34 AM
ఏపీ నిట్ భీమవరం ఈ ఏడాది కూడా కేవలం 480 సీట్లకే అడ్మిషన్లు ఇవ్వనుంది. మౌలిక వసతుల లోపంతో 750 సీట్లకు పెంపు సాధ్యపడలేదు.
మౌలిక వసతుల కల్పనకు రూ.438 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
మూడేళ్లుగా మంజూరు కాని నిధులు
(భీమవరం-ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో ఈ ఏడాది కూడా 480 సీట్లకే అడ్మిషన్లు కల్పించనున్నారు. గతంలో 750 సీట్ల వరకు పెంచినా హాస్టల్ వసతి, అధ్యాపక సిబ్బంది లేరన్న కారణంగా సీట్లను కుదించేశారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఏటా అడ్మిషన్లలో 50 శాతం రాష్ట్ర విద్యార్థులకు లభిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులు నష్టపోకుండా కేంద్రం సీట్లు పెంచింది. ఏపీ నిట్ ప్రారంభ దశలోనే 480 సీట్లు మంజూరు చేశారు. క్రమంగా ఆ సీట్ల సంఖ్య 750కి పెరిగింది. గత ప్రభుత్వంలో నిట్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ విఫలమైంది. కాగా.. హాస్టల్స్, అడకమిక్ భవనాలు, ఫ్యాకల్టీ క్వార్టర్స్ నిర్మాణం కోసం రూ.438 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మూడేళ్ల క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా ఇప్పటికీ నిధులు మంజూరు కావడం లేదు. ఫలితంగా ఏపీ నిట్‌లో అదనపు మౌలిక వసతుల కల్పనకు అడ్డంకి ఏర్పడింది.