ORR : అమరావతికి ఓఆర్‌ఆర్ మణిహారం!
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:55 AM
రాజధాని అమరావతికి మణిహారం వంటి ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం.. గత ఐదేళ్లుగా ఆగిపోయిన దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్‌మెంట్ అప్రూవల్

రాష్ట్ర జీఎస్టీ మినహాయింపునకు చంద్రబాబు హామీ
ప్రాజెక్టు వ్యయంలో తగ్గనున్న రూ.1,156 కోట్ల భారం
అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపిన అప్రూవల్ కమిటీ
నాలుగు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచన
మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందే చాన్స్
ఆ వెంటనే పనులు ప్రారంభించే అవకాశం: ఎన్‌హెచ్‌ఐఏ
(గుంటూరు-ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి మణిహారం వంటి ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం.. గత ఐదేళ్లుగా ఆగిపోయిన దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఇప్పటికే ఓఆర్‌ఆర్‌కు ఆమోదం తెలిపింది. అయితే అలైన్‌మెంట్‌లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు సూచించింది. ఆ ప్రకారం మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి కూడా ఆమోదం లభించిందని, మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.
189.4 కి.మీ. మేర నిర్మాణం
కేంద్రం తాజాగా ఆమోదించిన అలైన్‌మెంట్ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డు 189.4 కి.మీ మేర ఏర్పాటు కానుంది. గుంటూరు, కృష్ణా జల్లాల్లోని 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో నిర్మాణం సాగనుంది. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఇటీవల ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌పై డ్రోన్ సర్వే చేయగా రెండుచోట్ల చేపల చెరువులు, ఒకచోట గోడౌన్, మరోచోట నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జుజ్జూరు, దుగ్గిరాలపాడు మధ్య, మైలవరం వద్ద, సగ్గూరు వద్ద, గుంటూరు జిల్లాలోని శలపాడు, వేజెండ్ల మధ్య ఈ మార్పులు చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. ఓఆర్‌ఆర్ తూర్పు భాగంలో కృష్ణాజల్లా వల్లూరుపాలెం- గుంటూరు జిల్లా మున్నంగి మధ్య 4.8 కి.మీ మేర ఒక వంతెన, పల్నాడు జిల్లా బలుసుపాడు కృష్ణాజిల్లా మున్నలూరు మధ్య 3.150 కి.మీ మేర మరొక వంతెన నిర్మించనున్నారు.
ప్రాజెక్టు వ్యయం కేంద్రానిదే
ఓఆర్‌ఆర్ నిర్మాణ వ్యయం మొత్తం రూ.16,310 కోట్లుగా అంచనా వేశారు. భూసేకరణ, సివిల్ వర్క్‌లకు కలిపి అయ్యే ఈ మొత్తాన్ని కేంద్రమే భరించనుంది. అయితే నిర్మాణానికి వినియోగించే సిమెంటు, స్టీలు తదితరాలకు రాష్ట్ర జీఎస్టీని మినహాయించడంతో పాటు, కంకర, గ్రావెల్, ఇసుకపై సీనరేజి ఫీజును కూడా మినహాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ప్రాజెక్టు వ్యయంలో రూ.1,156 కోట్ల మేర భారం తగ్గనుంది. ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు సంబంధించి పూర్తిస్థాయి ఆదేశాలు కొద్ది రోజుల్లో అందనున్నాయని, ఆ వెంటనే పనులు మొదలు పెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం 11 విభాగాలుగా, 3 దశల్లో ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరుతో పాటు మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి ఓఆర్‌ఆర్ పరిధిలోకి రానున్నాయి. కృష్ణాజిల్లా మైలవరం, గన్నవరం, ఆగిరిపల్లి, ఉయ్యూరుకు అత్యంత సమీపంలో ఓఆర్‌ఆర్ ఏర్పాటవుతోంది. దీని నిర్మాణంతో రాష్ట్రంలో రవాణా సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానం సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.