Share News

Pawan Kalyan: అభివృద్ధి అంటేనే ఆంధ్రా అనేలా ముందుకు వెళుతున్నాం

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:50 AM

ఐదేళ్ల అరాచక, చీకటి పాలనను తొలగించుకుని, వెలుగు రేఖల వైపు ఇప్పుడిప్పుడే ఏపీ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Pawan Kalyan: అభివృద్ధి అంటేనే ఆంధ్రా అనేలా ముందుకు వెళుతున్నాం

వైసీపీ చీకటిపాలన నుంచి వెలుగులోకి.. కూటమిపై ప్రజలు నమ్మకముంచారు

ఫలితంగానే 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు.. మోదీ, బాబు నేతృత్వంలో అభివృద్ధి పథంలోకి

వారిద్దరి నుంచి నేర్చుకుని పనిచేస్తున్నా.. విశాఖ సభలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

విశాఖపట్నం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల అరాచక, చీకటి పాలనను తొలగించుకుని, వెలుగు రేఖల వైపు ఇప్పుడిప్పుడే ఏపీ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రఽధాని మోదీ, సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధికి ఏపీలో ఆస్కారం లేదనే వాతావరణం ఉండేదన్నారు. అలాంటిది అభివృద్ధి అంటేనే ఆంధ్రా అనేలా ఈనాడు ముందుకు వెళుతున్నామని పవన్‌ తెలిపారు. సీఎం సూచనలు, ఆయన మార్గదర్శకమే తోడ్పాటునందిస్తున్నాయన్నారు. ‘‘కూటమిపై ప్రజ లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నాం. దీనిలో భాగంగానే రాష్ట్రానికి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధి యజ్ఞం నిరంతరం కొనసాగాలి’’ అని ఆయన అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి ఇచ్చారని, జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ 24 గంటలూ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రధాని ఉన్నారన్నారు. పీఎం సడక్‌ యోజన పథకం కింద ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు రోడ్డు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదనే ఉద్దేశం తో అన్నింటికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. సదుద్దేశం, సదాశయం లేకుండా కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ నడిచినా అది నిరర్ధకంగా చరిత్రలో మిగిలిపోయిందంటూ కాంగ్రెస్‌ నేత రాహల్‌గాంధీని ఉద్దేశించి అన్నారు. అదే ఒక సదాశయం, సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ ప్రజలతో మమేకమై ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మనిర్భర్‌ భారత్‌... స్వచ్ఛ భారత్‌ అయ్యాయన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 04:50 AM