Pawan Kalyan: ఆరు నెలల్లో 3,750 కి.మీ రోడ్లు..
ABN , Publish Date - Jan 13 , 2025 | 02:56 AM
ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల నిర్మాణంలో రికార్డులు సృష్టించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
22,500 మినీ గోకులాల నిర్మాణం: పవన్ కల్యాణ్
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల నిర్మాణంలో రికార్డులు సృష్టించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమైన మైలురాయి సాధించిందని పేర్కొన్నారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం 1,800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తే, తాము ఆరు నెలల్లోనే 3,750 కి.మీ. మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లల్లో 268 మినీ గోకులాలు నిర్మిస్తే.. తాము 22,500 నిర్మించామని వెల్లడించారు. పీవీటీజీ ఇళ్ల కోసం గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.91 కోట్లు ఖర్చు చేస్తే, తాము ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.