Banakacharla Clearance: బనకచర్ల అనుమతులకు ప్రతిపాదనలు పంపండి
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:49 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జలసంఘం సూచించింది. ప్రాజెక్టును ఒకే యూనిట్‌గా అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
కేంద్ర జలసంఘం సానుకూల స్పందన
కేంద్ర, రాష్ట్ర అధికారులతో సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్
ప్రాజెక్టు ఒకే యూనిట్‌గా అనుమతులు తీసుకోవాలని నిర్ణయం
నిధుల సమీకరణపై జలవనరుల శాఖ దృష్టి
కంపెనీల రిజిస్ట్రార్ వద్ద ‘జలహారతి కార్పొరేషన్’ రిజిస్ట్రేషన్
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి కావలసిన అనుమతుల కోసం తమకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జలసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్.. జలసంఘం అధికారులు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పర్యావరణం-అటవీ శాఖ, శ్రీశైలం పులుల అభయారణ్యం అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుమతులపై చర్చించారు.
రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రస్తుతం రూపకల్పన దశలో ఉంది. ఇది సిద్ధమయ్యాక కేంద్రానికి అందించి నిధులు మంజూరు చేయాలని కోరేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలనుకుంటోంది. ఒక్కో దశకు విడివిడిగా కేంద్ర సంస్థల అనుమతులు పొందడం కంటే.. మొత్తం ప్రాజెక్టు ఒకే యూనిట్‌గా అనుమతి తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. ఇందుకు జలసంఘం కూడా సానుకూలంగా స్పందించి పై సూచన చేసింది. జూన్ 1న టెండర్లను పిలవాలనుకుంటున్న ఈ ప్రాజెక్టుకు.. ముందుగానే నిధుల సమీకరణ చేయాలని జలవనరుల శాఖ యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ ‘జలహారతి కార్పొరేషన్’ను కంపెనీల రిజిస్ట్రార్ వద్ద రిజిస్టర్ చేశారు.