Share News

కొనుగోళ్లు వేగవంతం.. నోబిడ్లు తగ్గింపు

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:12 AM

మార్కెట్లో పొగాకు కొనుగోళ్లు వేగవంతంగా సాగేలా చూడటంతోపాటు రోజువారీ నోబిడ్‌ బేళ్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పొగాకు బోర్డు అధికారులు, కంపెనీల బయ్యర్లకు సూచించారు. స్థానిక కర్నూల్‌ రోడ్డులోని పేర్నమిట్ట సమీపంలో ఉన్న ఒంగోలు-1 పొగాకు వేలం కేంద్రాన్ని ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌తో కలిసి మంగళవారం మంత్రి స్వామి సందర్శించారు.

కొనుగోళ్లు వేగవంతం.. నోబిడ్లు తగ్గింపు
ఒంగోలు-1లో కొనుగోళ్లను పరిశీలిస్తున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యే బీఎన్‌

బోర్డు అధికారులు, బయ్యర్లకు సూచించిన మంత్రి డాక్టర్‌ స్వామి

ఎమ్మెల్యే బీఎన్‌తో కలిసి ఒంగోలులో పొగాకు కొనుగోళ్ల పరిశీలన

రైతులను ఆదుకొంది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టీకరణ

ఒంగోలు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో పొగాకు కొనుగోళ్లు వేగవంతంగా సాగేలా చూడటంతోపాటు రోజువారీ నోబిడ్‌ బేళ్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పొగాకు బోర్డు అధికారులు, కంపెనీల బయ్యర్లకు సూచించారు. స్థానిక కర్నూల్‌ రోడ్డులోని పేర్నమిట్ట సమీపంలో ఉన్న ఒంగోలు-1 పొగాకు వేలం కేంద్రాన్ని ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌తో కలిసి మంగళవారం మంత్రి స్వామి సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించడంతోపాటు లభిస్తున్న ధరలు, రోజువారీ వేలం వివరాలను రైతులు, బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధరలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ రోజువారీ నోబిడ్‌లు అధికంగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. వేలం కూడా చాలా ఆలస్యంగా సాగుతుందన్నారు. కర్ణాటకలో వేలం ముగిసినా ఇంకా ఇక్కడ మార్కెట్‌ పుంజుకోలేదన్నారు. దీనివల్ల కొనుగోలు సమయం పెరిగి నష్టపోతున్నామన్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు చెప్పిన పలు అంశాలపై పొగాకు బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావు, ఇతర అధికారులను మంత్రి స్వామి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో ఇటీవలే మార్కెట్‌ ముగిసిందని, ఇంకా కొంతమంది బయ్యర్లు మార్కెట్‌లోకి రావాల్సి ఉందని వారు తెలిపారు. మంచి గ్రేడ్‌ బేళ్లకు గరిష్ఠ ధర కిలోకు రూ.280 లభిస్తున్నదని చెప్పారు. కొందరు రైతులు గ్రేడింగ్‌ సరిగా చేయించకుండా బేళ్లు తీసుకురావడం, అలాగే ప్రస్తుతం వ్యాపారులు కొనుగోలు చేస్తున్న గ్రేడ్‌లకు బదులు లోగ్రేడ్లను తీసుకురావడం వల్ల నోబిడ్లు అధికంగా ఉంటున్నాయని వివరించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి తగు చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు. దీంతో బోర్డు ఈడీ విశ్వశ్రీకి అక్కడి నుంచి మంత్రి ఫోన్‌ చేశారు. వేలంకేంద్రంలో రైతులు తన దృష్టికి తెచ్చిన అంశాలపై ఆమెతో మాట్టాడారు. రైతు ప్రతినిధులతో సమావేశం ఉందని, రెండు రోజుల్లో కంపెనీల వారితో కూడా సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆ సందర్భంగా మంత్రికి ఈడీ వివరించారు.


బయ్యర్లతో మాట్లాడిన మంత్రి, ఎమ్మెల్యే

వేలం కేంద్రంలోని పలు కంపెనీల బయ్యర్లతో మంత్రి స్వామి, ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడారు. రైతులకు అసంతృప్తి లేకుండా ధరలు ఇవ్వాలని సూచించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ వేలం వేగవంతం కాకపోవడం, నోబిడ్లు అధికంగా ఉండటం పట్ల రైతులలో అసంతృప్తి, ఆందోళన వ్యక్తమవుతున్నదన్నారు. ఆ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి, తద్వారా కేంద్రం దృష్టికి కూడా రైతు సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గతంలో పొగాకు మార్కెట్‌ సంక్షోభంలో పడి రైతులు నష్టపోయినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆదుకొన్న విషయం రైతులందరికీ తెలుసన్నారు. అలా అవసరమైతే మళ్లీ కూడా పొగాకు రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని వారు ఇప్పుడు వేలం కేంద్రాలకు వచ్చి హడావుడి చేయడం రాజకీయం కోసం తప్ప రైతుల కోసం కాదన్నారు. కాగా అధికంగా ఉత్పత్తి అయిన పంటపై అపరాధ రుసుం లేకుండా గత ఏడాది వలే చేసేందుకు ప్రభుత్వం తరఫున కేంద్రంతో మాట్లాడి రైతులకు ఉపశమనం కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పొగాకు బోర్డు వైస్‌ చైర్మన్‌ బి.బ్రహ్మయ్య, సభ్యుడు ప్రసాదరావు, రైతు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 02:12 AM