Share News

పుష్కరకాలం తరువాత మేజర్‌లలో పూడికతీత

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:18 PM

సాగర్‌ కాలువలకు నీటి విడుదల జరుగుతుందంటే రైతులలో ఆందోళన ఉండేది. సాగర్‌ కాలువలలో పూడిక పేరుకు పోయి ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీటి విడుదల జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉండేవి.

పుష్కరకాలం తరువాత మేజర్‌లలో పూడికతీత
వెంపరాల మేజర్‌లో పూడకను తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌

అద్దంకి డివిజన్‌లో రూ.2.28కోట్లతో పనులు

సాగునీటి ప్రవాహానికి తొలగనున్న అడ్డంకులు

టీడీపీ కూటమి వచ్చాక ముందస్తుగా నిర్వహణ

గత ఏడాది మంత్రి గొట్టిపాటి చొరవతో గట్టెక్కిన సాగు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

అద్దంకి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ కాలువలకు నీటి విడుదల జరుగుతుందంటే రైతులలో ఆందోళన ఉండేది. సాగర్‌ కాలువలలో పూడిక పేరుకు పోయి ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీటి విడుదల జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉండేవి. ఈ నేపథ్యంలో రైతులు ఆలస్యంగా వరి సాగు చేపడుతుంటారు. గత ఏడాది సకాలంలో సాగర్‌ కాలువలకు నీటి విడుదల జరిగినా... నీటి ప్రవా హం ముందుకు సాగక రైతులు ఇబ్బంది పడ్డారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సాగర్‌ కాలువలకు నీటి విడుదల చేసిన తరువాత రైతుల ఆందోళనను గుర్తించి ఎక్స్‌కవేటర్‌లను ఏర్పాటు చేయించి తాత్కాలికంగా పూడిక తీత పనులు చేయించడంతో గత ఏడాది సాగునీటి కష్టాల నుంచి రైతులు గట్టెక్కారు.

సాగర్‌ కాలువలకు పుష్కరకాలం తరువాత పూడికతీత పనులు చేపట్టారు. 2012 సంవత్సరంలో సాగర్‌ కాలువల ఆధునికీకరణ పనులలో భాగంగా సిమెంట్‌ లైనింగ్‌ చేశారు. దీంతో సుమారు ఐదారు సంవత్సరాల తరువాత నీటి ప్రవాహనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగువ ఆయకట్టుకు కూడా సాగు నీటి సరఫరా జరుగుతుంది. అయితే మేజర్‌ కాలువలలో పూడిక పేరుకు పోవడంతో గత ఐదారు సంవత్సరాలుగా సాగు నీరు ముందుకు కదలక రైతులు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేయాలన్న సంకల్పంతో మేజర్‌ కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేశారు. అద్దంకి డివిజన్‌ పరిధిలో మేజర్‌ కాలువల మరమ్మతులకు 2.28 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటితో ఆయా మేజర్‌లలో పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ప్రారంభించారు. గత పక్షం రోజులుగా పనులు ప్రారంభమయ్యాయి. అద్దంకి సబ్‌ డివిజన్‌లో రూ.1.50కోట్లతో, సంతమాగులూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.53.59లక్షలతో, కోనంకి సబ్‌ డివిజన్‌లో రూ.24.50లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభించారు. అద్దంకి సబ్‌ డివిజన్‌ పరిధిలో పమిడిపాడు మేజర్‌కు రూ.94.70 లక్షలు, అద్దంకి మేజర్‌కు రూ.23.94 లక్షలు, వెంపరాల మేజర్‌కు రూ.21.28లక్షలు, గుంటుపల్లి మేజర్‌కు రూ.10.62లక్షలు కేటాయించారు. ఇప్పటికే అత్యధిక శాతం పనులు ప్రారంభమయ్యాయి.

నాడు నీటి విడుదలకు ముందు హడావుడిగా

నేడు నీటి విడుదల నిలిపిన వెంటనే పనులు

సాగర్‌ కాలువలలో మరమ్మతు పనులు నీటి విడుదలకు కొద్దిరోజులు ముందు హడావుడిగా పూర్తి చేసి కాంట్రాక్టర్‌లు, అధికారులు జేబులు నింపుకునే వారు. పనులు చేసీచేయక ముందే నీటి విడుదల జరిగేది. దీంతో మరమ్మతు పనులు చేసారో... లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వంలో పద్ధతి మారింది. సాగర్‌ కాలువలకు నీటి విడుదల నిలిపి వేసిన వెంటనే పనులు ప్రారంభించారు. నెలరోజుల వ్యవధిలో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో తాగునీటి అవసరాలకు మేలో నీటి విడుదల చేసే లోపలే పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో పూడిక తీత పనులలో మాయాజాలం చేసే అవకాశం తక్కువగా ఉం టుందనే అభిప్రాయం ఉంది. సుమారు పుష్కర కాలం తరువాత ఎట్టకేలకు మేజర్‌ కాలువలలో పూ డికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించ డం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:18 PM