కిలకిలరావాలు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 10:56 PM
జరుగుమల్లి గ్రామం పలు రకాల పక్షులు కిలకిలరావాలతో అలరారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల సందడి స్థానికులను ఆకర్షిస్తోంది.
జరుగుమల్లిలో ఏళ్లతరబడి పలు రకాల విదేశి జాతుల పక్షుల ఆవాసం
వేటగాళ్లను రానివ్వకుండా రక్షిస్తున్న గ్రామస్థులు
జరుగుమల్లి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : జరుగుమల్లి గ్రామం పలు రకాల పక్షులు కిలకిలరావాలతో అలరారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల సందడి స్థానికులను ఆకర్షిస్తోంది. గ్రామ బస్టాండ్ సెంటర్‌లోని ఉల్లేరమ్మ ఆలయం సమీపంలోని చింత, వేప చెట్లపై విదేశీ పక్షులు, పలురకాల కొంగలు ఆవాసం ఏర్పరచుకుని ఉంటున్నాయి. ఇవి స్థానికులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల క్రితం నుంచి ఇక్కడే ఉంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో అధికంగా వేప, చింత చెట్లు ఉండేవని, కాలక్రమంలో రెండు మూడు చెట్లు మాత్రమే మిగిలాయని తెలిపారు. ఉన్న చెట్లపై ఉండే పలు రకాల పక్షుల జోలికి వేటగాళ్లు వెళ్లకుండా నిలువరిస్తున్నామని చెప్పారు. అలాగే గ్రామ శివాలయంలోని బూరుగ, పలురకాల చెట్లపై కబోది పక్షులు దశాబ్దాలుగా ఆవాసం ఏర్పరచుకుని ఉంటున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటికి పగలు కనపడదు. రాత్రిళ్లు మాత్రమే చూస్తాయి. పగటి వేళల చెట్ల కొమ్మలను కాళ్లతో పట్టుకుని తలకిందులుగా వేలాడుతుంటాయి. రాత్రిళ్లు సందడి చేస్తుంటాయి.