నేలవాలిన మొక్కజొన్న
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:43 PM
మండలంలో బుధవారం తెల్లవారుజామున వీచిన పెనుగాలులకు కండె గింజ పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న పైరు నేలవాలగా, వర్షం ధాటికి కల్లాలలో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచాయి. మూడున్నర గంటల సమయంలో ఒక్కసారిగా వీచిన పెను గాలులతో కూడిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది.
పలుచోట్ల బొప్పాయి, అరటికి నష్టం
లబోదిబోమంటున్న రైతులు
పంగులూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలో బుధవారం తెల్లవారుజామున వీచిన పెనుగాలులకు కండె గింజ పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న పైరు నేలవాలగా, వర్షం ధాటికి కల్లాలలో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచాయి. మూడున్నర గంటల సమయంలో ఒక్కసారిగా వీచిన పెను గాలులతో కూడిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో బలంగా వీచిన పెనుగాలికి కండె గింజ పోసుకునే దశకు చేరుకున్న మొక్కజొన్న పైరు పదిఎకరాలకు పైగా పూర్తిగా నేలపాలై పనికి రాకుండా పోయింది. కోటపాడు, కొండమంజులూరు గ్రామాలలో మంగళవారం సాయంత్రం నూర్పిడి చేసి ఉంచిన మొక్కజొన్న రాశులు వర్షం ధాటికి నెమ్మెక్కాయి. పందిళ్లకు ఉంచిన పొగాకు తాళ్లను రైతులు వర్షానికి తడవకుండా కాపాడుకోవాలని పరిస్థితి. ఈ నెల 13న వీచిన గాలులకు కొండమూరు, రేణంగావరంలో నూర్పిడి చేరుకున్న మొక్కజొన్న నేలవాలి నష్టం వాటిల్లింది. వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులు కలవర పెడుతున్నాయి.
బల్లికురవ : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, గాలుల ప్రభావంతో మొక్కజొన్నపై దెబ్బ పడింది. మంగళవారం రాత్రి కొన్ని గ్రామాలలో కురిసిన భారీ వర్షం కురిసింది. బల్లికురవ మండలంలోని గంగపాలెం, కొణిదెన గ్రామాల్లో అకాల వర్షంతో మొక్కజొన్న కల్లాలపై గుండా వర్షపు నీరు పారింది. అలానే మొక్కజొన్న విత్తనాలు పూర్తిగా తడిచి పోయాయి. బుధవారం రైతులు తడిచిన మొక్కజొన్నను చూసి లబోదిబోమంటున్నారు. దెబ్బ తిన్న పంటలకు పంట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
పర్చూరు : ఆరుగాలం శ్రమించి పంటలు అకాల వర్షాలకు ఆవిరవుతున్నాయని రైతులు బోరుమంటున్నారు. మిర్చి, పొగాకు, మొక్కజొన్న రైతులు కల్లాల్లో, పందిళ్లకు ఉన్న పంటలను వానల నుంచి కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కల్లాల్లో ఉన్న మిర్చిని ఇంటికి తెచ్చి భద్రపరుచుకుందామన్నా పూర్తి స్థాయిలో అరకపోవడం వల్ల బూజుపట్టే ప్రమాదం ఉంది. పందిళ్ళకు ఉన్న పొగాకు, పొలాల్లో ఉన్న మొక్కజొన్న, కోతకు సిద్ధంగా ఉన్న మిర్చి వర్షానికి బెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, మరోపక్క వానలకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకొల్లు : బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులు అందోళన చెందారు. కల్లాల్లో మిర్చి, పొగాకు తడవకుండా కాపాడుకునేందుకు పరుగులు తీసారు. కొద్దిసేపటికి వాన ఆగిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
అర్ధరాత్రి వాన .. జలమయమైన రహదారులు
చీరాల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : నియోజకవ ర్గం పరిధిలో బుధవారం అర్ధరాత్రి జోరుగా వాన కురిసింది. సుమారు రెండు గంటల పాటు విడతల వారీగా కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాలు, రహదారులు సైతం వ ర్షపు నీటితో నిండాయి, ఈక్రమంలోనే చీరాల - బాపట్ల మధ్య రహదారిలో పలుచోట్ల జలమయంగా మారాయి. ముఖ్యంగా ఈపూరుపాలెం రోడ్లపైకి నీళ్లు నిలవడంతో వాహన దా రులు, ప్రజలు అసౌకర్యం చెందారు. ఈపూరుపాలెం ప్రధాన రహదారిలో కొన్నిచోట్ల చిన్నపాటి వానకి సైతం నీళ్లు నిలుస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
మార్టూరు : బుధవారం భారీ గాలులతో కూడిన వర్షానికి పొలాల్లో కల్లాల్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న విత్తనాలు కల్లాలో తడిసి పోయాయి. మండలంలో ద్రోణాదుల, ఇసుకదర్శి,నాగరాజుపల్లి, జొన్నతాళి తదిర గ్రామాలలో మొక్కజొన్న పంటను రైతులు కోశారు. వాటి విత్తనాలను పొలాల్లో కల్లాల్లో కొంతమంది ఆరబెట్టుకోగా, మరి కొంతమంది రైతులు ఇంటికి తీసుకు వచ్చి పరదాలు వేసి వాటిపై ఆరబెట్టుకున్నారు. రెండ్రోజుల నుంచి తేలికపాటి వర్షాలు కురవడం, భారీగా గాలులు వీయడంతో రైతులు అప్రమత్తంగానే ఉన్నారు. కానీ వేకువజామున అందరూ నిద్రపోయే సమయంలో భారీగాలులతో వర్షం కురవడంతో మొక్కజొన్న రైతు లు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి సమయంలో విత్తనాలను కాపాడుకోవడానికి అవకాశం లేకుండా పో యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వాటిని పరదాలలో వేసి ఆరబెట్టుకున్నారు. వ్యవసాయ అధికారి అంజిరెడ్డిని సంప్రదించగా గ్రామాలలో మొక్కజొన్నను కొంతమంది రైతులు మాత్రమే కోశారన్నారు. మరి కొంతమంది రైతుల పొలాల్లో ఇంకా అదేవిధంగా పంట ఉందన్నారు. అయినా తమ సిబ్బందితో గ్రామాలలో విచారిస్తామన్నారు.
సంతమాగులూరు : అకాల వర్షాలకు మిరపకాయలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పొలంలో ఆరబెట్టిన మిరపకాయలు తడిసిపోయా యి. ఈ ఏడాది మిరపకు గిట్టుబాటు ధర లేకపోవ డం, కూలి ధరలు ఎక్కువ అవడంతో రైతులు నష్టాలబారిన పడగా, తాజాగా కురిసిన వానలు నట్టేట ముంచేస్తున్నాయి.