సర్పంచ్, పూర్వ పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:38 PM
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అద్దంకి మండలం చినకొత్తపల్లి సర్పంచ్ గుజ్జుల మల్లిక, అప్పటి పంచాయతీ కార్యదర్శి కె. ఈశ్వరరెడ్డిపై ఉచ్చు బిగిచింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలో సుమారు రూ.40లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులు జరిగాయి.
కలెక్టర్ ఆదేశం
7 రోజులలో అపరాధ వడ్డీతో జమ చేయాలని సూచిన
ఆ ఇద్దరిపై బిగిసిన ఉచ్చు
అద్దంకి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అద్దంకి మండలం చినకొత్తపల్లి సర్పంచ్ గుజ్జుల మల్లిక, అప్పటి పంచాయతీ కార్యదర్శి కె. ఈశ్వరరెడ్డిపై ఉచ్చు బిగిచింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలో సుమారు రూ.40లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులు జరిగాయి. ఇందుకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.15,74,283 విలువైన మెటీరియల్‌ను టీడీపీ నేత మానం మురళీమోహన్‌దా్‌స సమకూర్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు విడుదల కాగా, ఆ మొత్తాన్ని మురళీమోహన్‌దా్‌సకు కాకుండా పంచాయతీ సర్పంచ్ మల్లిక సోదరుడు అయిన చంద్రగిరి వీరారెడ్డికి చెల్లించేందుకు బ్యాంక్ నుంచి పంచాయతీ సర్పంచ్, అప్పటి పంచాయతీ కార్యదర్శి (ప్రస్తుతం సంతమాగులూరు మండలం పాతమాగులూరు పంచాయతీ కార్యదర్శి) డబ్బులు డ్రా చేశారు. ఈ నేపథ్యంలో మానం మురళీమోహన్‌దా్‌స అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కదలి విచారణ చేపట్టారు. వివిధ స్థాయిలలో జరిగిన విచారణ లో నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి చంద్రగిరి వీరారెడ్డికి చెల్లించినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయగా, పునరుద్ధరించాలని సర్పంచ్ మల్లిక కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించారు.
వారం రోజుల్లో అపరాధ వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు
క్రిమినల్ కేసు నమోదుకు చర్యలు
మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన రూ.15,74,283తో పాటు అపరాధ వడ్డీతో సహా వారంరోజులలో పంచాయతీ ఖాతాకు జమచేయాలని కలెక్టర్ వెంటమురళి ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంపీడీవో శింగయ్య తెలిపారు. నిధులు దుర్వినియోగం రుజువు అయిన నేపథ్యంలో సర్పంచ్ మల్లిక, అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు చేపట్టాలని చీరాల డీఎల్‌పీవోను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డిని సస్పెండ్ చేస్తూ గతంలో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అయితే సస్పెండ్ చేసే అధికారం జిల్లా పంచాయతీ అధికారికి లేదని పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు అయినందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజులలోపు సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అటు క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు, ఇటు అపరాధ వడ్డీతో మొత్తం డబ్బులు పంచాయతీ ఖాతాకు జమచేయాలని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో సర్పంచ్, అప్పటి పంచాయతీ కార్యదర్శిపై పూర్తిస్థాయిలో ఉచ్చు బిగిసినట్లు అయింది.