దిగజారుతున్న ధాన్యం ధరలు
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:18 PM
ధాన్యం ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయి. దళారుల చెప్పిన ధరకే గత్యంతరంలేక అమ్ముకోవల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో రబీలో 1010, 15048, కేఎన్‌ఎం 1638 సన్నాల రకాల వరి పంటను సాగుచేశారు.
నెలలో బస్తాకు రూ.300 తగ్గిన వైనం
ఆందోళనలో ధాన్యం రైతులు
ముండ్లమూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ధాన్యం ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయి. దళారుల చెప్పిన ధరకే గత్యంతరంలేక అమ్ముకోవల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో రబీలో 1010, 15048, కేఎన్‌ఎం 1638 సన్నాల రకాల వరి పంటను సాగుచేశారు. ప్రస్తుతం నెల రోజుల నుంచి ముమ్మరంగా వరి కోతలు, పంట నూర్పిళ్ళు జరుగుతున్నాయి. 1010 రకం 75 కేజీల బస్తా రూ.1200లకు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో 1500 పలికిన ధర కాస్త నెల రోజుల వ్యవధిలోనే మూడు వందల రూపాయలకు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 1010 రకమే కాకుండా సన్నాలు రేటు కూడా తగ్గించారు. మొదట్లో రూ.1600 పలికిన ధర నేడు రూ.1400లకు దిగజారింది.
రజానగరం మేజరు కాలువ పరిధిలోని బసవాపురం, కెల్లంపల్లి, కొక్కెరకొండాయపాలెం, రెడ్డినగర్, శ్రీనివాసనగర్ గ్రామాల్లో కాలువలు, వ్యవసాయ బోర్ల కింద వరి సాగుచేశారు. మండలంలో రబీలో 2,650 ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట చేతికొచ్చేసరికి ధరలు దిగజారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి దాదాపు రూ.35 వేల నుంచి రూ. 40వేల వరకు పెట్టుబడి అయింది. పంట కోసేందుకు, నూర్పిడి చేసేందుకు అదనంగా మరో రూ .10వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది 1010 రకం దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ధర దగ్గరకు వచ్చే సరికి రైతులు డీలాపడ్డారు. దీంతో తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పసుపుగల్లు, చింతలపూడి, సింగనపాలెం, వేములబండ, పెద ఉల్లగల్లు, చిన ఉల్లగల్లు గ్రామాలకు చెందిన రైతులు పొలాల్లోనే పంట నూర్పిడి చేసి అమ్మకాలు చేస్తున్నారు. పంట కోసం తెచ్చిన అప్పులు సైతం తీరక పోగా రైతు ఆరుగాలం పడ్డ కష్టానికి ఏ మాత్రం ఫలితం దక్కటం లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నెల రోజుల్లోనే బస్తాకు రూ.300 తగ్గింది
- ఏలూరి ఆదిశేషయ్య, రైతు, బసవాపురం
ఈ ఏడాది రబీలో 1010 రకాన్ని ఎనిమిది ఎకరాల్లో సాగు చేశాను. పది రోజుల నుంచి నూర్పిళ్లు చేస్తున్నాం. బస్తా రూ.1200లకు గ్రామం లో నే వ్యాపారస్తులకు గత్యం తరంలేక విక్రయిస్తున్నాం. నెల రోజుల్లో రూ.300 తగ్గింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- ఇండ్ల నాగేశ్వరరావు, ధాన్యం రైతు, పసుపుగల్లు
వరి సాగుచేసిన రైతులను దళారులు నట్టేట ముంచుతు న్నారు. ఇష్టారీతిగా ధరలు త గ్గిస్తున్నారు. విధిలేక విక్రయిం చుకోవల్సి వస్తుంది. ప్రభు త్వం ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటుచేసి గిట్టుబా టు ధరకు కొనుగోలుచేయాలి. లేదంటే రైతుల పరి స్థితి దారుణంగా ఉంటుంది.