రేషన్ మాఫియా పాత్రే కీలకమా?
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:18 AM
ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్యచౌదరి హత్యలో రేషన్ మాఫియా పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తదనుగుణంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. హంతకులకు మండల, నియోజకవర్గస్థాయిలోని రాజకీయ నాయకుల అండ ఎంత మేరకు ఉందన్న విషయంపై విచారణ చేపట్టారు.
టీడీపీ నేత వీరయ్య హత్య కేసులో దొరికిన సూత్రధారులు
పాత్రధారుల కోసం గాలింపు
రాజకీయ పెద్దల అండపై ప్రత్యేక దర్యాప్తు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్యచౌదరి హత్యలో రేషన్ మాఫియా పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తదనుగుణంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. హంతకులకు మండల, నియోజకవర్గస్థాయిలోని రాజకీయ నాయకుల అండ ఎంత మేరకు ఉందన్న విషయంపై విచారణ చేపట్టారు. దీంతో ఈ హత్య కేసు మరికొన్ని మలుపులు కూడా తిరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు సూత్రధారులు పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య ఘటనలో పాల్గొన్న పాత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వేట ప్రారంభించాయి. ఇటు పాత్రధారులతోపాటు.. వారికి రాజకీయంగా ఎవరి అండ లభించిందన్నవిషయాన్ని తెలుసుకొని వివరాలను వెల్లడించాలన్న ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఒంగోలులో మంగళవారం రాత్రి టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగిన విషయం విదితమే. నాలుగు రోజుల అనంతరం శుక్రవారం హంతకులు వినియోగించిన స్కూటీ దొరికిన తర్వాత కేసు మిస్టరీ వీడేందుకు దారి ఏర్పడింది. తదనుగుణంగా హత్యతో వీరయ్య స్వగ్రామం, మండల స్థాయిలోని రేషన్, లిక్కర్ మాఫియాలతోపాటు ఇసుక వ్యాపారి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారికి ఆర్థిక సహకారాన్ని అందించిన వ్యక్తులను కూడా గుర్తించారు. తదనుగుణంగా పలువురుని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.
రేషన్ మాఫియాపై పోలీసుల దృష్టి
వీరయ్య హత్యలో రేషన్ మాఫియా పాత్రపైనే పోలీసులు ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. హతుని స్వగ్రామానికి చెందిన అనుమానితునితోపాటు మండలంలో వీరయ్యకు శత్రువుగా ఉంటూ రేషన్ మాఫియాలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనిపై రౌడీషీట్ ఉంది. రేషన్ దందాలో జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆవైపు ప్రత్యేక దృష్టి సారించారు. రేషన్ మాఫియాలో కీలకపాత్ర పోషిస్తున్న చీరాల ప్రాంతానికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అలాగే గత ఐదేళ్లలో రేషన్ మాఫియాలో ప్రస్తుత అనుమానితునితో సంబంధాలు ఉన్న మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు ప్రారంభించారు.
రాజకీయ అండపై ప్రత్యేక దర్యాప్తు
ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న వారికి రాజకీయపరమైన అండ లభించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు మద్యం, అటు రేషన్ మాఫియాలలో గత ఆరేడేళ్ల నుంచి డాన్‌గా పేరున్న వ్యక్తి పాత్ర ఉండటంతో పోలీసులు ముందుగా ఆవైపు దృష్టి సారించారు. ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డాన్‌గా వ్యవహరించిన వ్యక్తికి, మద్యం వ్యాపారికి మధ్య ఉన్న సంబంధాలను పోలీసులు ముందుగానే గుర్తించినట్లు తెలిసింది. అయితే రేషన్ డాన్‌కు ఉన్న రాజకీయ సంబంధాలపై తాజాగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఆయన రాజకీయ చరిత్రను ఆరంభం నుంచి పరిశీలించినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నాయకుడిగా చెలామణి అయిన ఆ డాన్‌కు ముఖ్య రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. తదనుగుణంగానే అతనిపై ఒకటికి రెండు, మూడు కేసులు ఉన్నా విచారణ ముందుకు సాగలేదన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలిసింది. తదనుగుణంగా అతనితో సంబంధం ఉన్న ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఒక మండల స్థాయి నాయకుడి జోక్యంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఫోన్ సంభాషణలు ఏమైనా వారి మధ్య జరిగాయా? వారిని ఇటీవల కలిశారా? వారి నుంచి కూడా ఆర్థిక సహకారం లభించిందా? అన్న అంశాలపై ఎస్పీ దామోదర్ స్వీయ దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. రాజకీయ అండదండలు లేకుండా ఇలాంటి హత్యకు పాల్పడ్డారన్న అనుమానంతో పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఇటీవల కాలంలో రేషన్ మాఫియా నుంచి ఎవరెవరికి డబ్బులు అందాయి, వారికి ఎదురైన సమస్యల్లో చూసీచూడనట్లు పోవాలని అధికారులకు ఎవరు ఫోన్ చేశారు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆక్రమంలోనే ఈ కేసులో భాగస్వామిగా భావిస్తున్న రేషన్ డాన్‌కు ఒకరిద్దరు నాయకుల అండదండలు ఉన్నట్లుగా గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. అలాంటి వారంతా వైసీపీ నేతలే కావడం గమనార్హం.
పోలీసుల అదుపులో అమ్మనబ్రోలు వాసి
స్వగ్రామంలో రాజకీయంగా వీరయ్యను విభేదిస్తూ ఇటీవల లిక్కర్ వ్యాపారంలో కూడా ప్రవేశించిన వారి పాత్ర కూడా హత్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి అదే గ్రామానికి చెంది హైదరాబాద్‌లో స్థిరపడిన హతుని విరోధి నుంచి ఆర్థిక సహకారం అందినట్లు కూడా పోలీసులు దర్యాప్తులో నిగ్గుతేల్చారు. తదనుగుణంగా హైదరాబాద్‌లో ఉన్న ఆ వ్యాపార ప్రముఖుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పటికే అతను తప్పించుకున్నారు. వెంటనే పోలీసులు ఆయన పాస్‌పోర్టును సీజ్ చేశారు. అయితే అతని ద్వారా గ్రామానికి చెంది ఈ కేసులో సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తికి భారీమొత్తంలో డబ్బులు అందినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు సహకరించిన వ్యాపారి సమీప బంధువు, అమ్మనబ్రోలుకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు శనివారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే రేషన్ డాన్‌కు రాజకీయ అండ ఉన్నట్లే గ్రామంలోని అనుమానితునికి కూడా రాజకీయ అండ ఉందా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గత కొద్దిరోజులుగా ఏ రాజకీయ నాయకుడికి ఫోన్ చేశారు అన్న విషయాన్ని గుర్తించి తదనుగుణంగా దర్యాప్తు చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో కిందిస్థాయిలో సూత్రధారులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కిరాయి హంతకులు మాత్రం ఇంకా దొరకలేదు. వారికి నాయకత్వం వహించినట్లు భావిస్తున్న ఇసుక వ్యాపారితోపాటు హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. వీరిని పట్టుకోవడంతోపాటు రాజకీయ అండనిచ్చిన నేతలను గుర్తించి ఒకటి రెండు రోజుల్లో ప్రాథమిక దర్యాప్తునకు ముగింపునిస్తూ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కిరాయి హంతకులు హైదరాబాదీయులా?
ఒంగోలులో వారంరోజులు మకాం
బాయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వీరయ్యచౌదరిని హత్య చేసేందుకు కిరాయి హంతకులు ఒంగోలులో వారం రోజులు మకాం వేసినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు ఒంగోలులోని ఓ హాస్టల్‌లో వారంరోజులు పాటు ఉండి వీరయ్యచౌదరి హత్యకు రెక్కీ నిర్వహించారనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అదేక్రమంలో ఇసుక వ్యాపారి ఆదేశాల మేరకు ఆ నలుగురికి అవసరమైన సదుపాయాలు ఓ యువకుడు చూశాడు. వారికి అవసరమైన భోజనం, టిఫిన్ ను అందజేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన అనంతరం కూడా నిందితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అంతేకాకుండా ఈ హత్యకు సంబంధించి కీలక సూత్రధారులు ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన ఇసుక వ్యాపారి దొరికితే సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎంతమంది అనే సమాచారం తెలుస్తుంది.
పోలీసుల అదుపులో వైసీపీ నాయకుడు?
నాగులుప్పలపాడు మండలానికి చెందిన కీలక వైసీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో మండలాన్ని శాసించిన సదరు నాయకుడు ఒంగోలు నివాసం ఉంటాడు. అయితే హత్యకు సంబంధించి కీలక అనుమానితుడైన రేషన్ మాఫియా డాన్‌కు ఆ నాయకుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆ నాయకుడిపై అనుమానాలు రావడంతో అతనిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.