Share News

రుణ సంబరం

ABN , Publish Date - Apr 17 , 2025 | 02:04 AM

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన కార్పొరేషన్‌కు పునరుజ్జీవం కల్పించింది.

రుణ సంబరం
ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా యూనిట్ల ఏర్పాటు

1,305 మంది లబ్ధిదారులు

రూ.54.61 కోట్ల రుణాలు

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు

జనరిక్‌ మందుల దుకాణాలు.. డ్రోన్‌లు, రవాణా వాహనాలు

ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన కార్పొరేషన్‌కు పునరుజ్జీవం కల్పించింది. అర్హత ఉన్న వారికి రుణాల మంజూరుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గత సోమవారం నుంచి ప్రారంభించింది. అన్ని మండలాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆయా వర్గాల వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన పథకాలన్నింటినీ పునఃప్రారం భిస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించే ప్రక్రియను చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను అటకెక్కించింది. సంస్థను కేవలం బోర్డుకే పరిమితం చేసింది. బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించకుండా బడుగులకు మొండిచేయి చూపింది. ప్రస్తుత ప్రభుత్వం ఒక్కో పథకాన్ని పునఃప్రారంభిస్తోంది. అందులో భాగంగా జిల్లాలో రూ.54.61 కోట్లతో ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతతో యూనిట్లను ఏర్పాటు చేయించేందుకు ఈనెల 14 నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. వచ్చేనెల 13వతేదీ వరకూ కొనసాగనుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ సొమ్మును విడుదల చేయగా బ్యాంకుల నుంచి మిగిలిన మొత్తాన్ని రుణంగా అందజేస్తారు. యూనిట్‌ విలువలో 40 శాతం సబ్సిడీగా, 55 శాతం బ్యాంకు నుంచి రుణంగా ఇస్తారు. లబ్ధిదారుడి వాటాగా కేవలం ఐదు శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

లక్ష్యాలు ఇలా...

  • యూనిట్‌ విలువ రూ.3లక్షలతో 246 మందికి ఆటోలు ఇవ్వనున్నారు.

  • రూ.8లక్షల యూనిట్‌ విలువైన నాలుగు చక్రాల ఆటోలు 50 మందికి మంజూరు చేయనున్నారు.

  • రూ.10లక్షల యూనిట్‌ విలువ కలిగిన గూడ్స్‌ ఆటోలు 50మందికి ఇవ్వనున్నారు.

  • రూ.10 లక్షల యూనిట్‌ విలువ కలిగిన కార్లు 50మందికి అందజేయనున్నారు.

  • రూ.10లక్షల యూనిట్‌ విలువ కలిగిన డ్రోన్లు ఐదుగురు సభ్యులుగా ఉండే 12 గ్రూపులకు అందజేయనున్నారు.

  • గరిష్ఠంగా రూ.20లక్షలు ఈవీ చార్జింగ్‌ యూనిట్‌ను ప్రయోగాత్మకంగా ఒకరికి ఇస్తారు.

  • జనరిక్‌ మెడికల్‌ దుకాణాలు 23మందికి, మెడికల్‌ ల్యాబ్‌లు 24మందికి, బ్యూటీపార్లర్లు 16 మందికి రూ.5లక్షల యూనిట్‌గా అందజేయనున్నారు.

  • రూ.4లక్షల యూనిట్‌ విలువతో 41మందికి ఫొటో స్టూడియో, కొబ్బరి పీచుతో వస్తువుల తయారీ యూనిట్లు 41 మందికి, ఆయుర్వేదిక్‌ మందుల దుకాణాలు 33 మందికి మంజూరు కానున్నాయి. రూ.3.95 లక్షలతో సోలార్‌ ప్యానెల్‌ అసెంబ్లింగ్‌ యూనిట్లను 33మందికి ఇవ్వనున్నారు.

  • జూట్‌ బ్యాగ్‌ల తయారీ యూనిట్లు 41 మందికి, సోలార్‌ ఉత్పత్తుల విక్రయం, అమర్చడం యూనిట్లు 33 మందికి రూ.3.95 లక్షలతో అందించనున్నారు. రూ.4లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు యూనిట్‌ విలువగా పలు యూనిట్లు వందల సంఖ్యలో మంజూరు చేయనున్నారు.


జూన్‌ 21 నుంచి యూనిట్ల గ్రౌండింగ్‌

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలను మంజూరుచేసేందుకు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వం యూనిట్ల గ్రౌండింగ్‌ ప్రక్రియను జూన్‌ 21వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఈలోపు లబ్ధిదారులు ఎంపిక, రుణ మంజూరు పత్రాల అందజేత, బ్యాంకుల్లో రుణాల విడుదల ప్రక్రియను పూర్తిచేస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన యూనిట్లు నిరుద్యోగులకు ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా ఉన్నాయి. ప్రజల నుంచి విశేషంగా స్పందన ఉన్న జనరిక్‌ మందుల దుకాణాలు, వ్యవసా యంలో నూతనంగా వినియోగిస్తున్న డ్రోన్లు, మెడికల్‌ ల్యాబ్‌లు, బ్యూటీపార్లర్లు, ఆటోలు, కార్లు, వస్తువులు తరలించే గూడ్స్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు రుణాలు మంజూరు చేయనున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 02:04 AM