Share News

మరిన్ని టీచర్‌ పోస్టులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:16 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు (సీడబ్ల్యూఎస్‌ఎన్‌) బోధించేందుకు స్పెషల్‌గా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాల విద్య చరిత్రలో మొదటిసారిగా ప్రాథమికోన్నత పాఠశాలల్లోని దివ్యాంగ విద్యార్థులకు బోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని టీచర్‌ పోస్టులు

జిల్లాకు 124 మంజూరు

మెగా డీఎస్సీలో భర్తీకి అనుమతి

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు (సీడబ్ల్యూఎస్‌ఎన్‌) బోధించేందుకు స్పెషల్‌గా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాల విద్య చరిత్రలో మొదటిసారిగా ప్రాథమికోన్నత పాఠశాలల్లోని దివ్యాంగ విద్యార్థులకు బోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారీగా ప్రత్యేక విద్య సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులను ఇస్తోంది. ఈమేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 పూర్వ ఉమ్మడి జిల్లాలకు మొత్తం 2,260 ప్రత్యేక విద్య టీచర్‌ పోస్టులను కొత్తగా ఇచ్చారు. వీటిలో ఎస్జీటీ 1,136, ప్రత్యేక విద్య స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1,124 ఉన్నాయి. అందులో జిల్లాకు 124 ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు చేశారు.

డీఎస్సీ అభ్యర్థులకు మేలు

1 నుంచి 5 తరగతుల వరకు దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రాల్లోనే విలీన విద్య రిసోర్స్‌ టీచర్లు (ఐఈఆర్టీ) బోధిస్తున్నారు. మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యేక టీచర్లను నియమించనున్నారు. ప్రభుత్వం ప్రకటించనున్న మెగా డీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన నిరుద్యోగ టీచర్లకు మేలు చేకూరనుంది.


మిగులు పోస్టుల మార్పిడి

ప్రామాణిక వైకల్యం కలిగిన పిల్లలకు మేలు చేకూరేలా ఈ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆటిజం, మానసిక వైకల్యం, నిర్థిష్ట అభ్యసన లోపం, బుద్ధిమాంద్యం గల విద్యార్థులకు బోధించేందుకు వీలుగా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో మిగులుగా తేలిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులను ఈ ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులుగా మార్పిడి చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ కొత్తవాటికి బదులుగా 74 ఎస్జీటీ , 50 స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు రద్దుకానున్నట్లు సమాచారం.

Updated Date - Apr 17 , 2025 | 01:16 AM