ధరల కోత.. అక్రమ కొనుగోళ్లు
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:01 AM
పొగాకు మార్కెట్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. వేలం కేంద్రాలలో కూటమి కట్టి గరిష్ఠ ధరలపై సీలింగ్ పెట్టుకుంటున్నారు. అధికారులు సూచించిన రేటుకు కూడా బేళ్లను కొనుగోలు చేయకుండా భారీగా నోబిడ్లకు కారణమవుతున్నారు.
ఒడిదొడుకుల్లో పొగాకు మార్కెట్
వ్యాపారుల సిండికేట్
పలు వేలం కేంద్రాల్లో భారీగా నోబిడ్లు
నియంత్రించడంలో బోర్డు విఫలం
మేలు రకాన్ని నిల్వ చేస్తున్న రైతులు
రైతు ప్రతినిధులతో నేడు గుంటూరులో బోర్డు ఈడీ సమావేశం
పొగాకు మార్కెట్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. వేలం కేంద్రాలలో కూటమి కట్టి గరిష్ఠ ధరలపై సీలింగ్ పెట్టుకుంటున్నారు. అధికారులు సూచించిన రేటుకు కూడా బేళ్లను కొనుగోలు చేయకుండా భారీగా నోబిడ్లకు కారణమవుతున్నారు. అదేసమయంలో తమకు అవసరమైన మేర వేలం కేంద్రాల వెలుపల అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొం టోంది. దీంతో సాధారణ రైతులు నష్టపోతున్నారు. తక్షణం ఆర్థిక సమస్యలు లేని వారు మేలురకం బేళ్లను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొని ఒక మోస్తరు నాణ్యత ఉన్న వాటినే అమ్మకాలకు తెస్తున్నారు. దీంతో మార్కెట్ మరింత గందరగోళంలో పడుతోంది. ఈనేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసి సజావుగా నడిపించాల్సిన పొగాకు బోర్డు అధికారులు ఆ విషయంలో విఫలమవుతున్నారు. ఫలితంగా ధరల సమస్య ఏర్పడింది.
ఒంగోలు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాదిలో ప్రస్తుత సీజన్ (2024-25)లో 105 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. సుమారు 161 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అయినట్లు అంచనా. పొగాకు కొనుగోళ్లు గతనెల 11న ప్రారంభమయ్యాయి. తొలిరోజు గరిష్ఠ ధర కిలో ఏకంగా రూ.280 పలికింది. గతేడాది కన్నా కిలోకు రూ.50 పెంచి ప్రారంభ ధరను వ్యాపారులు ఇవ్వడంతో ఈ ఏడాది కూడా గతంలో వలే మార్కెట్ హాట్‌హాట్‌గా ఉంటుందని రైతులు భావించారు. అయితే వారం, పది రోజులు గడిచేసరికే ఆ వాతావరణం పోయింది. వ్యాపారులంతా కూటమి కట్టి గరిష్ఠ ధరను కిలో రూ.280కి నియంత్రించారు. ఇక ఆ ధరకు కూడా తక్కువ బేళ్లకు ఇస్తున్నారు. మెజారిటీ బేళ్లను కిలో రూ.240 నుంచి రూ.260లోపుగా కొనుగోలు చేస్తున్నారు. మీడియం, లోగ్రేడ్‌లలో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్‌రకం బేళ్లను మరింత తగ్గించి వేస్తున్నారు. వాటికి బోర్డు అధికారులు బిడ్డింగ్ పెట్టిన ధరలు కూడా ఇవ్వడం లేదు. రైతులు కూడా ఈ ధరలు చూసి నాణ్యమైన రకం బేళ్లను భవిష్యత్‌లో మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే ఆలోచనతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి ఒక మోస్తరుగా ఉన్నవి మాత్రమే తెస్తున్నారు. అలా అటు వ్యాపారులు, ఇటు రైతుల తీరుతో నిత్యం పలు కేంద్రాల్లో భారీగా బేళ్లు నోబిడ్ అవుతున్నాయి.
25శాతం వరకు నోబిడ్లు
ఎస్‌బీఎస్ రీజియన్‌లోని వెల్లంపల్లి, ఒంగోలు-2 వంటి కేంద్రాలలో నోబిడ్‌లు 25శాతం వరకూ ఉంటున్నాయి. ఇతర కేంద్రాల్లో 15శాతం వరకూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వేలం కేంద్రాల్లో ధరలు పెరగకుండా కూటమి కట్టి వ్యవహారాలు నడుపుతున్న వ్యాపారులు తమకు అవసరమైన బేళ్లను బయట అక్రమంగా కొంటున్నారు. టంగుటూరు, ముక్తినూతలపాడు ప్రాంతాలకు చెందిన మధ్యస్థాయి డీలర్లు, వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జోరుగా అక్రమ కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొగాకు రంగంలో ఎగుమతిదారులుగా పేరున్న రెండు, మూడు కంపెనీల వారు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా బయట కొనుగోళ్లను ప్రోత్సహిస్తుండగా బోర్డు నిఘా విభాగం వాటిని నియంత్రించడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. వెలుపల బేళ్ల విక్రయాలకు రైతులు అయిష్టంగా ఉన్నప్పటికీ ఇంచుమించు నెలరోజులుగా మార్కెట్లో ధరలు పెరగకపోవడమే కాక నోబిడ్లు పెరుగుతుండటంతో అటువైపు మొగ్గుచూపుతున్నారు. కర్ణాటకలో వేలం పూర్తయినా ఇక్కడ వేగం అందుకోకపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం బయటకొనే వ్యాపారులకు తమ ఆర్థిక అవసరాల రీత్యా పొగాకును అమ్మేస్తున్నారు.
బయట కిలో రూ.240!
బయట కొనుగోలు చేస్తున్న కిలో పొగాకుకు వ్యాపారులు రూ.240 మాత్రమే రైతులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఈ తరహా అమ్మకాలకు దూరంగా ఉన్నప్పటికీ డబ్బు అవసరమైన వారు, అనధికారిక బ్యారన్లు వేసిన వారు ఇలా అమ్ముతున్నారు. మార్కెట్‌లో ఉన్న పరిస్థితులతో దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాలలో 40రోజుల క్రితం వేలం ప్రారంభించినా ఇప్పటి వరకు కేవలం 12 మిలియన్ కిలోల పంటను మాత్రమే కొనుగోలు చేశారు. ఇలా అయితే మొత్తం పంట 161 మిలియన్ కిలోల విక్రయాలకు ఆరేడు మాసాలకుపైన పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గుర్తించిన కొందరు రైతు ప్రతినిధులు, బోర్డు సభ్యుల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి ఈ గందరగోళ పరిస్థితిని తీసుకెళ్లారు. దీంతో పొగాకు బోర్డు ఈడీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన విశ్వశ్రీ ఈ అంశంపై దృషి ్టపెట్టారు. పొగాకు రైతు ప్రతినిధులు, బోర్డు కీలక అధికారులతో మంగళవారం గుంటూరులోని బోర్డు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వ్యాపారులతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. కాగా సమావేశంలో స్థానికంగా వేలంకేంద్రాలలో ధరల కోత, అక్రమ కొనుగోళ్లు తదితర అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రైతు ప్రతినిధులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.