ఉగ్రదాడిపై వెల్లువెత్తిన నిరసనలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:17 AM
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం పలుచోట్ల శాంతి ర్యాలీలు, ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నివాళులు, ఇతర రూపాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా శాంతి ర్యాలీలు
పలుచోట్ల నల్లబ్యాడ్జీలతో హాజరైన ముస్లింలు
మృతులకు ఘనంగా నివాళులు
ఒంగోలులో జనసేన మానవహారం
విభిన్నవర్గాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
విశాఖలో చంద్రమౌళి అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి స్వామి
ఒంగోలు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం పలుచోట్ల శాంతి ర్యాలీలు, ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నివాళులు, ఇతర రూపాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఈనెల 22న ఉగ్రవాదులు అక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై తెగబడి కాల్పులు జరిపిన విషయం విదితమే. అందులో 26మంది మృతి చెందగా మరో 20మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ జిల్లాలో పెద్దఎత్తున రెండు రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీలను విభిన్నవర్గాల ప్రజలు నిర్వహించారు.
జనసేన ఆధ్వర్యంలో మానవహారం
ఒంగోలులో జనసేన ఆధ్వర్యంలో చర్చిసెంటర్ వద్ద భారీ మానవహారం ఏర్పాటు చేశారు. అంతకుముందు నగరంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జనసేన నాయకులు షేక్ రియాజ్, కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్.మోహన్‌దాస్, బొడ్డు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్స్‌తో ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఉగ్ర దాడులను ఖండిస్తూ జిల్లావ్యాప్తంగా ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రార్థనలకు హాజరయ్యారు. మార్కాపురం, కంభం, పొదిలిలతోపాటు పలు ఇతర ప్రాంతాలలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. పామూరు, మార్కాపురంతోపాటు పలు ఇతర ప్రాంతాలలోనూ జనసేన, వామపక్షాలు నిరసన ర్యాలీలు చేపట్టారు. ఉగ్ర దాడిలో విశాఖకు చెందిన జె.ఎస్.చంద్రమౌళి మృతిచెందిన విషయం విదితమే. ఆయన అంత్యక్రియలు శుక్రవారం విశాఖలో నిర్వహించగా ఆ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న మన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి పాల్గొన్నారు.