పునరావాసం కీలకం
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:29 AM
జిల్లాలో తక్షణ సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి అంశాలను కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాల యంలో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల సమీక్షా సమావేశం జరిగింది.

వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయాలి
ఒంగోలు డెయిరీని పునరుద్ధరించాలి
యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ నిర్మాణాలు..
వేసవి తాగునీటి అవసరాలకు నిధులు
కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి
కీలక అంశాలను తీసుకెళ్లిన అన్సారియా
‘వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యవసరంగా పునరావాసం కల్పించాలి. ఒంగోలు డెయిరీని పునరుద్ధరించాలి. తక్షణ అవసరాల కింద రానున్న వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఏకేయూ వర్సిటీ, ట్రిపుల్ ఐటీ నిర్మాణాలు చేపట్టాలి..’ ఇలా పలు కీలక అంశాలను అమరావతిలోని సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అన్సారియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే సీజన్‌లో సాగర్ కాలువలకు నీరు విడుదల చేసేలోపు అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. అందుకోసం నిధులను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి పశ్చిమంలో ఇప్పటికే తాగునీటి సమస్య నెలకొన్నదని రానున్న రోజుల్లో అది మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల వృద్ధికి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలను ప్రస్తావించారు.
ఒంగోలు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తక్షణ సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి అంశాలను కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాల యంలో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన కలెక్టర్ అన్సారియా జిల్లాలో ఆయా ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, అభివృద్ధి లక్ష్యాలు, వాటి సాధన మార్గాలపై నివేదికలను ఇచ్చారు. బుధవారం సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 14 మండలాల్లోని 230 ఆవాసాలలో నీటి ఎద్దడి వస్తుందని యంత్రాంగం గుర్తించిందన్నారు. ఆ ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూ.11.20 కోట్ల మేర నిధులు అవసరమని ప్రభుత్వానికి తెలి పారు. ఐదేళ్లుగా కనీస నిర్వహణ పనులను కూడా జిల్లాలోని సాగర్ కాలువల్లో చేపట్టక పెద్దఎత్తున చిల్లచెట్లు పెరిగాయ న్నారు. పూడిక పేరుకుపోవడంతో నీటి సరఫరా సజావుగా లేదన్నారు. దాని వల్ల దిగువకు నీటి సరఫరా సరిగా జరగక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. వచ్చే సీజన్‌లో తిరిగి సాగర్ కాలువలకు నీటిని ఇచ్చే లోపు ఆ కాలువల్లో కనీస పనులు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం రూ.9.83కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు.
వెలిగొండకు నిధులు ఇవ్వాలి
వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న నిర్వాసితుల పునరావాసం విషయాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు పరిధిలో గతంలో గుర్తించిన దాని ప్రకారం 7,321 నిర్వాసిత కుటుంబాలు ఉండగా 96ను మాత్రమే అక్కడి నుంచి తరలించారన్నారు. మరో 640 కుటుంబాల తరలింపు ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. మొత్తం నిర్వాసితుల కుటుంబాలను 2026 నాటికి తరలించాల్సి ఉందన్న కలెక్టర్... వారికి నష్టపరిహారం చెల్లింపు, పునరావాస కల్పనకు ప్రాధాన్యత క్రమంలో నిధులు ఇవ్వాలని కోరారు.
పాడి పరిశ్రమను బలోపేతం చేయాలి
ఒంగోలు డెయిరీ మూతపడిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాడిపరిశ్రమ బలోపేతానికి తద్వారా గ్రామీణ పశుపోషణ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి డెయిరీ పునరుద్ధరణ కీలకం కానుందన్నారు. జిల్లాలో పెద్ద విద్యా సంస్థలుగా ఉన్న కీలకమైన ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీల భవన నిర్మాణాలు, సిబ్బంది నియామకాల అవసరాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ సరైన వసతులు లేకుండా నడస్తున్నదన్నారు. భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన.. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియామకాలకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మూడు క్యాంప్‌సలలో విద్యార్థులు
ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్ ఐటీ మూడు క్యాంప్‌సలలో నడుస్తున్నదన్నారు. ఈ సంస్థ విద్యార్థులలో 2,200 మంది కడప జిల్లాలోని ఆర్‌కే వ్యాలీలో, 3వేల మంది ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఎస్‌ఎ్‌సఎన్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంప్‌సలో, మరో 1,400 మంది రావ్ అండ్ నాయుడు కాలేజీ క్యాంప్‌సలో చదువుకుంటున్నారన్నారు. క్యాంప్‌సల నిర్మాణం జరగక ఈ పరిస్థితి నెలకొన్నదన్న కలెక్టర్.. నిధులు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.