Share News

‘పది’లో ప్రతిభ చాటారు

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:00 AM

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. 85.43 శాతం ఉత్తీర్ణత సాధించి శభాష్‌ అనిపించారు. రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం, రాష్ట్రస్థాయి స్థానం దిగజారింది.

‘పది’లో ప్రతిభ చాటారు
గిద్దలూరులో టపాసులు కాలుస్తున్న జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు

జిల్లా విద్యార్థుల మెరుగైన ఫలితాలు

బాలికలదే పైచేయి

జిల్లాలో 85.43 శాతం ఉత్తీర్ణత

రాష్ట్రంలో 9వ స్థానం

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. 85.43 శాతం ఉత్తీర్ణత సాధించి శభాష్‌ అనిపించారు. రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం, రాష్ట్రస్థాయి స్థానం దిగజారింది. అయితే రాష్ట్ర సగటు ఉత్తీర్ణతతో పోలిస్తే జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చారు. ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతలోనూ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు.

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 29,386 మంది హాజరు కాగా 25,103 మంది పాసయ్యారు. 85.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత సగటున 81.14శాతం కాగా, జిల్లా విద్యార్థులు 4.29శాతం అధికంగా పాసయ్యారు. రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచారు. ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. వారు 87.02శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 3.20శాతం తక్కువగా 83.87శాతం మంది పాసయ్యారు. బాలికలు 14,506 మంది పరీక్షకు హాజరుకాగా 12,623 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో సగటున బాలికలు 84.09శాతం మంది ఉత్తీర్ణులు కాగా జిల్లా బాలికలు 3శాతం మంది అదనంగా సాధించారు. బాలురు 14,880 మంది పరీక్షకు హాజరు కాగా 12,480 మంది పాసై 83.87శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో బాలుర ఉత్తీర్ణత సగటు 78.35శాతం కాగా జిల్లాలో 5.5శాతం మంది అధికంగా పాసయ్యారు.

మార్కుల సాధనలో మేటి

జిల్లా విద్యార్థులు మార్కుల సాధనలోను మేటిగా నిలిచారు. 21,661 మంది ప్రథమ శ్రేణిలో, 2,520 మంది ద్వితీయ శ్రేణిలో పాసయ్యారు. కేవలం 872 మంది మాత్రమే తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ప్రథమశ్రేణి ఉత్తీర్ణతలో విశాఖ జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవగా మన జిల్లా విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి మెరిశారు.

96 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని 96 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 608 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 96 స్కూళ్లలో పరీక్ష రాసిన విద్యార్థులందరూ పాసయ్యారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానంలో జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు ఉన్నాయి. 54 ప్రైవేటు పాఠశాలలు, 25 జడ్పీ హైస్కూళ్లు ఐదు కేజీబీవీలు, ఏపీ సాంఘిక సంక్షేమ, బీసీ సాంఘిక సంక్షేమ గురుకులాలు మూడేసి, ఏపీ మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లు రెండేసి, ఏపీ రెసిడెన్షియల్‌, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు ఒక్కొక్కటి వందశాతం ఉత్తీర్ణత సాధించి ఆగ్రభాగాన నిలిచాయి.


యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత

ఎయిడెడ్‌లో 444 మందికి 326 మంది ఉత్తీర్ణులై 73.42శాతం సాధించారు.

ఏపీ మోడల్‌ స్కూళ్లలో 444 మందికి 404మంది (90.99శాతం) పాసయ్యారు.

ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 208 మందికి 203 మంది పాసై 97.6శాతం సాధించారు.

ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో 857 మందికి 813 మంది (94.87శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఏపీడబ్ల్యూఆర్‌ఎస్‌లో 54 మందికి 25 మంది (46.3శాతం) పాసయ్యారు.

ఏపీటీడబ్ల్యూఎస్‌లో 289 మందికి 210 మంది ఉత్తీర్ణులై 72శాతం సాధించారు.

బీసీడబ్ల్యూఆర్‌ఎస్‌ 218 మందికి 211 మంది (96.79శాతం) పాసయ్యారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 1,887 మందికి 1,198 మంది పాసై 63.49శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

కేజీబీవీల్లో 1,017 మందికి 880 మంది (86.53శాతం) పాసయ్యారు.

మునిసిపల్‌ స్కూళ్లలో 561 మందికి 432 మంది (77.01శాతం) ఉత్తీర్ణులయ్యారు.

జడ్పీ హైస్కూళ్లలో 11,894 మందికి 9,597 మంది (80.69శాతం) పాసయ్యారు.

ప్రైవేటులో 11,513 మందికి 10,804 మంది (93.84శాతం) ఉత్తీర్ణులయ్యారు.

మొత్తం 29,386 మందికి 25,103 మంది పాసై 85.43శాతం ఉత్తీర్ణత సాధించారు.

Updated Date - Apr 24 , 2025 | 01:00 AM