Share News

వీరయ్యకు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:03 AM

ఒంగోలులో మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన టీడీపీ ముఖ్యనేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరికి టీడీపీ శ్రేణులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన అమ్మన బ్రోలులో జరిగాయి. స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి వీరయ్యచౌదరి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

వీరయ్యకు కన్నీటి వీడ్కోలు
వీరయ్య చౌదరి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, మాజీ ఎమ్మెల్యే గరటయ్య

స్వగ్రామంలో అంత్యక్రియలు

నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

కుటుంబ సభ్యులకు పరామర్శ

హంతకులు ఎక్కడ ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరిక

పాల్గొన్న మంత్రులు, తరలివచ్చిన టీడీపీ శ్రేణులు

జనసంద్రంగా మారిన అమ్మన బ్రోలు

నిలకడగా ఈదర హరిబాబు ఆరోగ్యం

ఒంగోలు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన టీడీపీ ముఖ్యనేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరికి టీడీపీ శ్రేణులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన అమ్మన బ్రోలులో జరిగాయి. స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి వీరయ్యచౌదరి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో జిల్లాకు సీఎం చేరుకున్నారు. చదలవాడ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగి అక్కడి నుంచి కాన్వాయ్‌లో అమ్మనబ్రోలు చేరారు. స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ ప్రాథమికంగా హత్యకు సంబంధించిన అంశాలను బస్సులో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముందుగానే అక్కడకు చేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులను కూడా హత్య గురించి చంద్రబాబు వాకబు చేశారు. పోలీసు అధికారులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం నేరుగా వీరయ్యచౌదరి నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. వీరయ్య భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని వారిని ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వీరయ్య చౌదరి చేసిన సేవలను కొనియాడారు. ఇలా క్రూరంగా ఆయన్ను హత్య చేయడం తనను కలిచివేసిందన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వణికిపోయిందన్నారు. టీడీపీ పాలనలో అలాంటి పరిస్థితికి తావులేదన్నారు. హంతకులు ఎక్కడ ఉన్నా పట్టుకొని కఠినంగా శిక్షించి వీరయ్యచౌదరి ఆత్మకు శాంతి చేకూర్చుతామన్నారు.

మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తి

ఒంగోలులో మంగళవారం రాత్రి హత్య అనంతరం వీరయ్యచౌదరి మృతదేహాన్ని స్థానిక రిమ్స్‌ మార్చురీలో ఉంచగా బుధవారం 12గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్రమంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యేలు బీఎన్‌ విజయ్‌కుమార్‌, దామచర్ల జనార్దన్‌, అశోక్‌రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ తదితరులు అస్పత్రికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన అమ్మనబ్రోలు తరలించారు. తొలుత ఎంపీ మాగుంట కార్యాలయంలో వారు భేటీ అయి వీరయ్య హత్య, తదంతర పరిణామాలపై చర్చించారు. అలాగే బుధవారం జరగాల్సిన డీఆర్సీ సమావేశాన్ని రద్దు చేసుకొని అమ్మనబ్రోలు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అమ్మనబ్రోలుకు తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు

అమ్మనబ్రోలుకు వీరయ్య చౌదరి భౌతికకాయం మధ్యాహ్న సమయంలో చేరగా వేలాదిగా టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. దీంతో గ్రామం జనసంద్రంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చిన సమయంలోనూ జనంతో కిటకిటలాడింది. కడసారి తమ నాయకుడిని చూసేందుకు ప్రజానీకం తరలిరావడంతోపాటు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో రాష్ట్రమంత్రులు, టీడీపీ కీలక నేతలతోపాటు వీరయ్య చౌదరి సమీప బంధువైన పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఈ ఘటనపై ఆరా తీశారు. మోహన్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవడంతోపాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిలకడగా హరిబాబు ఆరోగ్యం

వీరయ్యచౌదరి దారుణ హత్యతో షాక్‌కు లోనై గుండెపోటుకు గురైన ఆయన మేనమామ, జడ్పీ మాజీ చైర్మన్‌ ఈదర హరిబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. మంగళవారం రాత్రి రిమ్స్‌ వద్ద వీరయ్యచౌదరి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన హరిబాబు ఆ వెంటనే అనారోగ్యానికి గురయ్యారు. ప్రైవేటు వైద్యశాలకు తరలించగా గుండెపోటు అని నిర్ధారించిన వైద్యులు తక్షణ చికిత్స చేశారు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుండగా మరోసారి కూడా గుండెపోటు రావడంతో ఆందోళన నెలకొంది. వైద్యులు సీపీఆర్‌ చేసి ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.

వీరయ్య హత్య కేసుపై సీఎం సమీక్ష

టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయాన్ని సందర్శించేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగులుప్పల్పపాడు మండలం అమ్మనబ్రోలుకు వచ్చారు. ఈ సందర్భంగా చదలవాడ హెలిప్యాడ్‌ వద్ద ఉన్నతాధికారులతో ఆయన కొద్దిసేపు సమీక్ష నిర్వహించారు. కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరతగతిన పట్టుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంవో చీఫ్‌ సెక్రటరీ ప్రద్యుమ్న, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేష్‌చంద్ర లడ్హా, లాఅండ్‌ ఆర్డర్‌ డీజీ మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎస్పీ దామోదర్‌ పాల్గొన్నారు.


అండగా నిలుద్దాం..

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : మాజీ ఎంపీపీ వీరయ్యచౌదరి హత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలతోపాటు అతని కుటుంబానికి అండగా నిలవాలని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక మాగుంట కార్యాలయంలో బుధవారం ఉదయం మంత్రులు, శాసనసభ్యులు, ఇన్‌చార్జిలు భేటీ అయ్యారు. వాస్తవంగా ఒంగోలులో బుధవారం జిల్లా సమీక్షామండలి (డీఆర్సీ) సమావేశం జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మంగళవారం రాత్రి వీరయ్య చౌదరి ఆయన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. మంగళవారం రాత్రి రిమ్స్‌లో వీరయ్య మృతదేహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించారు. బుధవారం ఒంగోలుకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ స్వామిలు స్థానిక రామనగర్‌లోని మాగుంట కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య, దర్శి, వైపాలెం ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరయ్య హత్యపైనే వారు ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం.

Updated Date - Apr 24 , 2025 | 01:03 AM