Share News

ఏకలవ్యకాలనీలో నాటుబాంబు కలకలం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:48 PM

రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఓ వ్యక్తి నాటుబాంబు విసిరిన సంఘటన సోమవారం రాత్రి స్థానిక ఏకలవ్యకాలనీలో చోటుచేసుకుంది.

ఏకలవ్యకాలనీలో నాటుబాంబు కలకలం

రెండు వర్గాల మధ్య ఘర్షణ

పందులను చంపేందుకు వినియోగించే నాటుబాంబు ప్రయోగం

కుక్క కొరకడంతో పేలి మృతి

మార్కాపురం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఓ వ్యక్తి నాటుబాంబు విసిరిన సంఘటన సోమవారం రాత్రి స్థానిక ఏకలవ్యకాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకున్నా, ఆ నాటుబాంబును కొరికిన కుక్క మృతి చెందింది. పట్టణ ఎస్సై ఎం.సైదుబాబు కథనం మేరకు, ఎస్టేట్‌కు సమీపంలోని ఏకలవ్య కాలనీలో ఒకే సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య సోమవారం నుంచి ఘర్షణ వాతావరణం అలుముకున్న పరిస్థితుల్లో... అదే కాలనీకి చెందిన బల్లాని శంకర్‌ ఒక సెల్‌ఫోన్‌ను అదేప్రాంతానికి చెందిన ఓ మహిళకు విక్రయించాలని చూశాడు. దొంగసొత్తు అని అనుమానించి తనకు వద్దని నిరాకరించింది. దీంతో ఆమెను శంకర్‌ దుర్భాషలాడాడు. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు దేవరకొండ సురేష్‌ వెంటనే శంకర్‌ వద్దకు వెళ్లి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సురే్‌షతోపాటు మరికొందరు కలిసి శంకర్‌పై దాడిచేశారు. దీంతో కోపోద్రిక్తుడైన శంకర్‌ పందులను చంపేందుకు ఉపయోగించే నాటుబాంబును సురేష్‌, అతని అనుచరులపై విసిరాడు. అది పేలకుండా పక్కన పడింది. పందులను ఆకర్షించేందుకు ఆ బాంబుకు జీవాల కొవ్వులను పూస్తారు. ఆ వాసనకు అటుగా వెళ్లిన ఓ కుక్క నాటుబాంబును నోటకరిచి గట్టిగా కొరికింది. దీంతో అది పేలి కుక్క తల ఛిద్రమై అక్కడిక్కడే మృతిచెందింది. సురేష్‌ దాడిలో గాయాలపాలైన శంకర్‌ను మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఇరువైపులా ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. నాటుబాంబుల విషయమై ఎస్సై సైదుబాబును వివరణ కోరగా ఏకలవ్య కాలనీలోని ఓ సామాజికవర్గం వాళ్లు పందులను చంపేందుకు ఈ రకమైన బాంబులు తయారు చేసుకుంటారని తెలిసిందన్నారు. వాటిని పొలాల్లోకి వచ్చే అడవి పందులు గట్టిగా కొరికితేనే పేలుతాయన్నారు. నాటుబాంబులు తయారు చేయడం నేరం కాబట్టి ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - Apr 01 , 2025 | 11:48 PM