వాగు భూమి హాంఫట్
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:59 AM
కనిగిరి ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు రియల్టర్లు చెలరేగిపోయారు. ఖాళీ జాగా నుంచి ప్రభుత్వ, అసైన్డ్ భూముల వరకూ వదలకుండా ఆక్రమించి వెంచర్లు వేశారు. వాటిని అమ్ముకొని పెద్దమొత్తంలో సొమ్ము చేసుకున్నారు.
9 ఎకరాలు ఆక్రమించి వెంచర్లు
పట్టించుకోని అధికారులు
పెద్దమొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు
తెరవెనుక చక్రం తిప్పుతున్న వైసీపీ నేతలు
కనిగిరి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు రియల్టర్లు చెలరేగిపోయారు. ఖాళీ జాగా నుంచి ప్రభుత్వ, అసైన్డ్ భూముల వరకూ వదలకుండా ఆక్రమించి వెంచర్లు వేశారు. వాటిని అమ్ముకొని పెద్దమొత్తంలో సొమ్ము చేసుకున్నారు. వాగులు, వంకలు, పోరంబోకు, పశువుల బీడులను కబ్జా చేసి పోడు మట్టితో మెరకలు పోసి సొంతం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి భూ అక్రమాలకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు కొత్త పంథాకు తెరలేపారు. వెనకుండి చక్రం తిప్పుతూ అధికారపార్టీ అండదండలున్న నేతలను ముందుంచి కథ నడిపిస్తున్నారు.
వేలాది ఎకరాలు అన్యాక్రాంతం
వైసీపీ హయాంలో వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. పామూరు, కనిగిరి మండలాల్లో భూబకాసురుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అప్పట్లో కనిగిరిలో జరుగుతున్న భూఅక్రమాలను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. ఈమేరకు వైసీపీ పాలనలో ప్రభుత్వ, పశువుల బీడు, పోరంబోకు భూముల ఆక్రమణ, కబ్జాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రజల్ని అప్రమత్తం చేశారు. అదేసమయంలో జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భూమేత బయటపడింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారు. ఎన్నికలు రావడంతో దర్యాప్తు కొనసాగలేదు. కనిగిరి ప్రాంతంలో భూ అక్రమాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి.
వాగులు ఆక్రమించి వెంచర్లు
పట్టణంలోని కొత్తూరు ఆంజనేయస్వామి దేవాలయం వెనుకవైపు అరకిలోమీటర్ దూరంలోని సర్వే నంబరు 388/1లో 9.85 ఎకరాల అలుగు వాగు భూమి ఉంది. రెవన్యూ రికార్డులోనే అదేవిధంగా నమోదై ఉంది. ఈ వాగు వెంబడే ఉన్న 388/2లో 2.05 ఎకరాలు చుక్కల భూమి (22ఏ)గా ఉంది. ఈ చుక్కల భూమిని కొనుగోలు చేసిన రియల్టర్‌లు గత వైసీపీ ప్రభుత్వంలో వాగు ఆక్రమించి వెంచర్ వేసేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలతో అప్పటి మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్ అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈలోపు ఎన్నికలు రావడంతో వ్యవహారం నడవలేదు. దీంతో అప్పుడు స్తబ్ధుగా ఉన్న అక్రమార్కులు మళ్లీ వెంచర్ ఏర్పాటుకు సిద్ధపడ్డారు. అందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా వాగుపై చప్టా కూడా నిర్మించి వెంచర్ వేసి ప్లాట్ల విక్రయానికి తెగబడ్డారు. ఆయా వెంచర్‌కు విద్యుత్ స్తంభాలు కూడా మంజూరు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించలేదు. దీని వెనుక డివిజన్ స్థాయి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు పెద్దఎత్తున తాయిలాలు ముట్టాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీలోని కొందరి సహకారం
గత వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసేందుకు అప్పట్లో డాక్టర్ ఉగ్ర పోరాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అలాంటి అక్రమాలకు తావులేకుండా హెచ్చరికలు చేస్తున్నారు. ఇది భూ కబ్జారాయుళ్లకు ఇబ్బందిగా మారింది. తాజాగా 388/2లోని భూమిని డాటెడ్ ల్యాండ్ నుంచి తొలగించడంతో వైసీపీ నేతలు తిరిగి అక్రమాలకు తెరలేపారు. వాగును ఆక్రమించి పోడు మట్టిని పోసి వెంచర్ వేశారు. ప్లాట్లుగా హద్దురాళ్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. టీడీపీలో ఎన్నికలకు ముందు చేరిన కొంత మంది వైసీపీకి చెందిన ఆక్రమణదారులకు సహకరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.