Share News

బడి రూపురేఖలు మారే!

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:10 AM

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రకాల స్కూళ్ల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది రకాలు అమలులోకి రానున్నాయి. కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం ఎన్‌ఈపీకి అనుగుణంగా గత ప్రభుత్వం ఎనిమిది రకాల పాఠశాలలను తెస్తూ జీవో 117ను అమలు చేసింది.

బడి రూపురేఖలు మారే!

మొత్తం ఎనిమిది రకాల పాఠశాలలు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రకాల స్కూళ్ల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది రకాలు అమలులోకి రానున్నాయి. కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం ఎన్‌ఈపీకి అనుగుణంగా గత ప్రభుత్వం ఎనిమిది రకాల పాఠశాలలను తెస్తూ జీవో 117ను అమలు చేసింది. అయితే దాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 117 జీవోను రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా ఐదు రకాలను ప్రతిపాదిస్తూ జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన వివిధ మార్పుల్లో తాజాగా ఎనిమిది రకాల బడులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. కూటమి ప్రభుత్వం తొలుత ప్రకటించిన ఐదు రకాల పాఠశాలలకు అదనంగా ప్రాథమికోన్నత పాఠశాలలు, 1 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్‌ (ఇంటర్మీడియట్‌) పాఠశాలలు చేరనున్నాయి. ఈ ఎనిమిది రకాల పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల డ్రైవ్‌ కూడా ప్రారంభమైంది.

శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్‌ : ఈ పాఠశాలల్లో కేవలం పూర్వ ప్రాఽథమిక విద్యను మాత్రమే బోధిస్తారు. వీటిని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఇక నుంచి శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూళ్లుగా వ్యవహరిస్తారు.

ఫౌండేషనల్‌ స్కూళ్లు: ఈ పాఠశాలలల్లో పూర్వ ప్రాథమిక విద్యతోపాటు 1, 2 తరగతుల విద్యార్థులకు బోధిస్తారు.

బేసిక్‌ ప్రైమరీ స్కూలు: ఈ పాఠశాలల్లో పూర్వ ప్రాఽథమిక విద్యతోపాటు 1 నుంచి 5 తరగతులకు బోధిస్తారు.

మోడల్‌ ప్రైమరీ స్కూలు : కూటమి ప్రభుత్వ మానస పుత్రికలుగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు ఆవిర్భవిస్తున్నాయి. వాటికి ఒక ప్రైమరీ స్కూలు హెచ్‌ఎం, స్కూలు అసిస్టెంటు, ఐదు ఎస్‌జీటీ పోస్టులు తరగతికి ఒకటి చొప్పున కేటాయిస్తున్నారు. ఈ పాఠశాలల్లో పూర్వ ప్రాథమికోన్నత విద్యతోపాటు 1 నుంచి 5 తరగతులు బోధిస్తారు.

హైస్కూళ్లు(6-10) : హైస్కూళ్లలో 6 నుంచి 10 తరగతులకు మాత్రమే బోధిస్తారు. గతంలో విలీనం చేసిన 3,4,5 తరగతుల విద్యార్థులను మళ్లీ పాథమిక పాఠశాలలకు పంపుతారు. యుపీ స్కూళ్లను విద్యార్థులు ఎక్కువమంది ఉన్న వాటిని హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. తక్కువ విద్యార్థులు ఉన్న వాటిని ప్రాఽథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్‌ చేసి అక్కడి 6,7,8 తరగతుల విద్యార్థులను సమీపంలోని హైస్కూళ్లకు పంపుతారు.

ప్రాథమికోన్నత పాఠశాలలు : ఈ స్కూళ్లలో 1 నుంచి 8 తరగతులు వరకు బోధిస్తారు. అయితే 1 నుంచి 5 తరగతులు, 6,7,8 తరగతులకు విద్యార్ధుల సంఖ్య ప్రామాణికంగా సెకండరీ గ్రేడు టీచర్లను కేటాయిస్తున్నారు.

హైస్కూళ్లు (1 నుంచి 10): హైస్కూళ్ల విషయంలో ప్రభుత్వం మనసు మార్చుకుంది. మొదట 3,4,5 తరగతులనే వెనక్కు పంపాలనుకున్న ప్రభుత్వం తాజాగా 1 నుంచి 10 తరగతులు కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకే ఆవరణలో అన్ని తరగతులు ఉంటే అక్కడి ఎలిమెంటరీ విద్యార్థులను కూడా హైస్కూళ్లలో చేర్చుకుంటారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్ధులు 60 మందికి మించితే ప్రత్యేకంగా ఒక ప్రైమరీ హెచ్‌ఎంను కేటాయించి కొత్త యూడైస్‌ కోడ్‌ ఇస్తారు. 60మందికిలోపు ఉంటే దాని బేసిక్‌ ప్రైమరీ స్కూలుగా అలాగే ఉంచి 1 నుంచి 10 తరగతుల బాధ్యతను హైస్కూలు హెచ్‌ఎం చూస్తారు.

హైస్కూల్‌ ప్లస్‌ (ఇంటర్మీడియట్‌) : హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ తరగతులను ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. వీటిల్లో మొదట బాలిక జూనియర్‌ కళాశాలలు కొనసాగుతాయి. ఆతర్వాత ప్రారంభమైన కోఎడ్యుకేషన్‌ కళాశాలలు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Apr 23 , 2025 | 02:10 AM