దొనకొండలో దాహం దాహం
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:00 PM
మండలకేంద్రమైన దొనకొండ ప్రజల దాహంతీర్చే సాగర్ జలాలు సరఫరా జరగకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్ అవతలివైపు వారం రోజులుగా, ఇటువైపున ఒబ్బాపురం ప్రాంతానికి దాదాపు నెలరోజులుగా నీటి సరఫరా జరగడంలేదు. చందవరం-1 స్టోరేజీలో సంమృద్ధిగా సాగర్‌నీరు ఉన్నా మంచినీటి కష్టాలు తప్పటంలేదు.
- తరచూ పైపులైను మరమ్మతులు
- నీటి సరఫరాకు అంతరాయం
- శిథిలావస్థలో చందవరం-1 సాగర్ నీటి స్టోరేజీ
దొనకొండ, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రమైన దొనకొండ ప్రజల దాహంతీర్చే సాగర్ జలాలు సరఫరా జరగకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్ అవతలివైపు వారం రోజులుగా, ఇటువైపున ఒబ్బాపురం ప్రాంతానికి దాదాపు నెలరోజులుగా నీటి సరఫరా జరగడంలేదు. చందవరం-1 స్టోరేజీలో సంమృద్ధిగా సాగర్‌నీరు ఉన్నా మంచినీటి కష్టాలు తప్పటంలేదు. ఒబ్బాపురం ఎన్‌ఏపీ ట్యాంక్ పరిధిలో దాదాపు వందకు పైగా గృహాలకు నెలరోజులుగా నీటి సరఫరా జరగకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు అయినా మినరల్ వాటర్ కొనుగోలు చేసుకొని దాహార్తి తీర్చుకుంటున్నారు. తరచూ పైపులైను పగలటం, లీకులు అవుతుండటంతో మంచినీటి సమస్య తీవ్రమైంది. నూతన పైప్‌లైన్ ఏర్పాటు జరిగితేనే మంచినీటి సమస్యకు పరిష్కారం మవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
దొనకొండ మండలంలోని 29 గ్రామాల ప్రజల దాహార్తి నిమిత్తం నెదర్లాండ్ ఆర్థిక సహాయంతో 1982లో 885 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రూ.2.75 కోట్ల వ్యయంతో సాగర్ కాలువకు రెండు కిలోమీటర్ల దూరంలో చందవరం-1 మంచినీటి స్టోరేజీని నిర్మించారు. ఇది నిర్మించి 43 సంవత్సరాలు గడవటంతో శిథిలావస్థకు చేరింది. నీటి సరఫరా నిమిత్తం ఏర్పాటుచేసిన పైపులైను తరచూ మరమ్మతులకు గురవుతుంది. దీనికితోడు ఇటీవల కొందరు పశుపోషకులు పశువుల దాహార్తి నిమిత్తం పైపును పగులకొట్టి నీటిని గుంతలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. చందవరం-1 మంచినీటి స్టోరేజీ పూర్తిగా నిరుపయోగమై మంచినీటి సమస్య తీవ్రం కాకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.