Share News

ముదిగొండకు ముప్పు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:38 AM

ఒంగోలు మండలం దేవరంపాడు రెవెన్యూ పరిధిలోని బీరంగుంట సమీపాన ముదిగొండవాగు ఆక్రమణ కోరల్లో చిక్కుకుంది. అక్రమార్కులు వారం నుంచి రొయ్యల చెరువుల సాగుకు అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు.

ముదిగొండకు ముప్పు
ముదిగొండివాగును చదును చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

బీరంగుంట సమీపాన వాగును ఆక్రమించి రొయ్యల చెరువుల తవ్వకం

వరద దిగువకు వెళ్లేందుకు ఇబ్బందులు

సమీప లోతట్టు పల్లెలు, వరి పొలాలు మునిగే ప్రమాదం

ఒంగోలురూరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మండలం దేవరంపాడు రెవెన్యూ పరిధిలోని బీరంగుంట సమీపాన ముదిగొండవాగు ఆక్రమణ కోరల్లో చిక్కుకుంది. అక్రమార్కులు వారం నుంచి రొయ్యల చెరువుల సాగుకు అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. వాగు సుమారు 300 మీటర్లు వెడల్పు ఉంటుంది. అక్రమార్కులు ప్రస్తుతం వాగును కేవలం 30 మీటర్లు మాత్రమే వదిలి మిగిలిన 270 మీటర్ల వెడల్పును ఆక్రమించి రొయ్యలు చెరువులుగా ఎక్స్‌కవేటర్లతో తవ్వి కట్టలు వేస్తున్నారు. ఇలా సుమారు 700 మీటర్ల పొడవున కట్టలు వేశారు. వాగుకు దక్షణం వైపు మాత్రమే నీటిప్రవాహానికి 30 మీటర్లు కాలువ వదిలారు.

సుమారు 25 ఎకరాలపైనే ఆక్రమణ

ఇప్పటివరకు రొయ్యల చెరువు ల తవ్వకాల వి స్తీర్ణం 25 ఎకరాలుపైగానే ఉం టుందని పరిసర రైతులు చెబుతున్నారు. ముదిగొండవాగు మూసుకుపోతే త్రోవగుంట దగ్గర నుంచి సముద్రతీరప్రాంత గ్రామమైన పాతపాడు గ్రామం వరకు వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతాయి.


ఆక్రమణ వల్ల గ్రామాలకు పంటలకు ఇబ్బందులు

ప్రస్తుతం ముదిగొండ వాగు ఆక్రమణ వల్ల పరిసర గ్రామాలు ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. త్రోవగుంట దగ్గర, చేజర్ల దగ్గర గ్రామాల పరిధిలో ముదిగొండ వాగు సమీపంలో రైతులు ఏటా సుమారు 700 ఎకరాలలో వరి పంట సాగు చేస్తుంటారు. దిగువన వాగు ఆక్రమణల వల్ల.. వరదలు వస్తే ఈ వరి పంట పొలాలు ముంపునకు గురవుతాయి. వర్షాకాలంలో వాగు ఉగ్రరూపంతో ప్రవహిస్తూ వరదలు వస్తుంటాయి. గతంలో వాగు ఉధృతికి చేజర్ల, ఉలిచి, పాతపాడు, త్రోవగుంట లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాక ముదిగొండవాగు ఉధృతికి మండవవారిపాలెం దగ్గర డ్రీమ్స్‌ వ్యాలీ, ఎస్సీ కాలనీల్లోకి ముదిగొండ కట్టదాటి నీటి ప్రవాహం జరిగి ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. కొత్తపట్నం మండలంలోని గాదెపాలెం, ఆలూరు, బీరంగుంట గ్రామాలకు కూడా వరద ప్రమాదం పొంచిఉంది. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించివాగులో ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు.

బాధ్యులపై కేసులు పెడతాం

వాసు, తహసీల్దార్‌

ముదిగొండి వాగులో తవ్వకాలు చెపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు పెడతాం. వాగులలో తవ్వకాలు పూర్తిగా నిషేధం. ముదిగొండలో ప్రవాహం ఉంటుంది. ఈ వాగులో తవ్వకాలు చేపడితే కాలువ పక్కన గల గ్రామాల ప్రజలకు, పంటఅ పొలాలకు ఇబ్బందే. వీఆర్‌వో, మండల సర్వేయర్లను పంపించి పరిశీలించి, అలాంటి వ్యక్తులపై పోలీస్‌ కేసులు పెడతాం. తవ్వకాలను పూడ్చివేయిస్తాం.

Updated Date - Apr 23 , 2025 | 12:38 AM