Share News

టాపర్‌కు టూర్‌ ప్యాకేజీ

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:01 PM

Tour package for topperప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ స్థాయిలో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పేరుతో పాఠశాలల అభివృద్ధికి సంకల్పించింది

టాపర్‌కు టూర్‌ ప్యాకేజీ
కార్పొరేట్‌కు దీటుగా రూపొందుతున్న దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల

పదిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి విమాన ప్రయాణం

పీఎంశ్రీ నిధులు, పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి బాటలో దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల

విద్యార్థులను ప్రభుత్వ బడివైపు ఆకర్షించేలా ఓ పూర్వ విద్యార్థి వినూత్న ఆఫర్‌

క్రీడల్లోనూ జాతీయస్థాయిలో గుర్తింపు

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఎదుగుదల

ప్రస్తుతం 1000 మంది విద్యార్థులతో కళకళ

వచ్చే ఏడాది డైమండ్‌ జూబ్లీకి ప్రణాళికలు

దొనకొండ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ స్థాయిలో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పేరుతో పాఠశాలల అభివృద్ధికి సంకల్పించింది. పీఎంశ్రీ పథకంలో మొదటి విడతగా దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల 2002లో ఎంపికైంది. అప్పట్లో 800 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 1000 మంది ఉన్నారు. 30 తరగతి గదులున్నాయి. 30 మంది ఉపాధ్యాయులున్నారు. పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఏటా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది పది ఫలితాల్లో 173 మంది విద్యార్థులకు గాను 166 మంది ఉత్తర్ణత సాధించారు.

పీఎంశ్రీ పథకం కింద జరుగుతున్న పనులివీ..

పీఎంశ్రీ నిధులతో రూ.4.25 లక్షలు ఖర్చు చేసి ప్లేగ్రౌండ్‌ లెవలింగ్‌, ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ, లాంగ్‌జం్‌పల కోర్టుల ఏర్పాటు చేస్తున్నారు.

కిచెన్‌గార్డెన్‌, దివ్యాంగ విద్యార్థులకు సౌకర్యవంతమైన ర్యాంపుల నిర్మాణం, వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత తదితర పనులు సాగుతున్నాయి.

క్రీడల్లో జాతీయ స్థాయి గుర్తింపు

పాఠశాలకు చెందిన విద్యార్థులను హెచ్‌ఎం సహకారంతో ఫిజికల్‌ డైరెక్టర్‌ నరసింహారావు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. బేస్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, నెట్‌బాల్‌ క్రీడల్లో ఏటా పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులు నెట్‌బాల్‌ పోటీల్లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో పాఠశాలలో ఎన్‌సీసీ ప్రారంభించి ప్రస్తుతం ఎన్‌సీసీలో వంద మంది విద్యార్థులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు

పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలకు ఢిల్లీలో జరిగిన ఓరియంటేషన్‌ తరగతుల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి రీసోర్స్‌పర్సన్స్‌గా ఎంపికైన ఐదుగురు హెచ్‌ఎంలలో దొనకొండ హెచ్‌ఎం రామాంజనేయులు పాల్గొనటం విశేషం.

ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దొనకొండల పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షసాయి, ఉపాధ్యాయుడు చాంద్‌బాషా పాల్గొన్నారు.

పదో తరగతి ఫలితాల్లో పాఠశాలలో ప్రథమ, ద్వితీయస్థాయిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విమానం ఎక్కిస్తానంటూ పాఠశాల పూర్వ విద్యార్థి మాడిశెట్టి నాగేశ్వరరావు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి హైదరాబాద్‌లోని అన్ని ప్రదేశాలు విద్యార్థులకు చూపించి తిరిగి హైదరాబాద్‌ నుంచి గన్నవరం వరకు విమాన ప్రయాణం చేయిస్తానని పూర్వ విద్యార్థి ప్రకటించినట్లు ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు.

1989-90 విద్యార్థులు పాఠశాలకు ఐరన్‌గేట్‌, పాఠశాల పేరుతో ఆర్చీని ఏర్పాటు చేశారు.

1980-81 విద్యార్థులు స్టేజీ ఏర్పాటు చేశారు.

1984-85 విద్యార్థులు బోరు, విద్యుత్‌ మోటారు ఏర్పాటు చేశారు.

1992-93 విద్యార్థులు రూ.2లక్షల ఖర్చుతో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాలు, లైబ్రరీ, ఇన్వెర్టర్‌ తదితర వస్తువులు అందించి పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందిస్తున్నారు.

విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు దోహదం

అటు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు, ఇటు పూర్వ విద్యార్థులు ఆర్థికంగా, వస్తురూపంలో అందిస్తున్న సంపూర్ణ సహకారంతో పాఠశాల కార్పొరేట్‌స్థాయిలో రూపొందుతోంది. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ అభివృద్ధి ఎంతో దోహదపడుతోంది. పాఠశాల ప్రారంభించి వచ్చే ఏడాదికి 75 సంవత్సరాలు అవుతున్నందున అందరి సంపూర్ణ సహకారంతో డైమండ్‌ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలనుకుంటున్నాం.

- రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు

Updated Date - Apr 17 , 2025 | 11:01 PM