తూర్పున అతలాకుతలం
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:18 AM
జిల్లాలోని తూర్పుప్రాంతాన్ని బుధవారం ఉదయం అకాల వర్షం ముంచెత్తింది. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లోని పలు మండలాలతోపాటు దర్శి ప్రాంతంలోనూ ఒక మోస్తరు నుంచి భారీవాన కురిసింది.
ఒంగోలును ముంచెత్తిన వాన
ఇతర ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీగా
ఉరుములు, మెరుపులతో పిడుగులు
భయకంపితులైన జనం
దర్శి ప్రాంతంలో నేలవాలిన పంటలు
200 గ్రామాల్లో ఉపాధి పనులకు బ్రేక్
ఒంగోలు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని తూర్పుప్రాంతాన్ని బుధవారం ఉదయం అకాల వర్షం ముంచెత్తింది. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లోని పలు మండలాలతోపాటు దర్శి ప్రాంతంలోనూ ఒక మోస్తరు నుంచి భారీవాన కురిసింది. ఒంగోలు నగరంలో తెల్లవారుజామున వర్షం దంచికొట్టింది. దర్శి ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో పదిరోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగింది. అదేసమయంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం, గాలులు అధికంగా ఉంటున్నాయి. ఈక్రమంలో బుధవారం తెల్లవారుజామున జిల్లా తూర్పుప్రాంతంలో దాదాపు రెండు, మూడు గంటల పాటు పెద్దఎత్తున ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. ఒంగోలు నగరాన్ని అయితే వాన ముంచెత్తింది. జిల్లాలో సగటున బుధవారం ఉదయం 10.50 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులో అత్యధికంగా ఎస్‌ఎన్‌పాడు మండలంలో 60.8 మి.మీ కురవగా ఒంగోలులో 55.4, తాళ్లూరులో 45.8, దర్శిలో 40.80, టంగుటూరులో 28.0, జరుగుమల్లిలో 24.2, కొండపి 22.2, కొత్తపట్నంలో 20.4, మద్దిపాడులో 20.2, ఎన్‌జీపాడులో 18.4 మి.మీ కురిసింది. మరికొన్ని మండలాల్లో జల్లులు పడ్డాయి.
నగరం జలమయం
బుధవారం తెల్లవారుజామున అందరూ నిద్రలేచే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాన కురిసింది. దీంతో జనం భయకంపితులయ్యారు. ప్రత్యేకించి ఒంగోలు నగరంలో తెల్లవారేసరికి ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధానమైన రోడ్లపై రెండు, మూడు అడుగుల ఎత్తులో నీరు పారింది. మరోవైపు దర్శి నియోజకవర్గంలో ప్రత్యేకించి దర్శి, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రస్తుతం పొలంలో ఉన్న వరి, మొక్కజొన్న, సజ్జ వంటి పంటలు నేలవాలాయి. చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడు, కొత్తపట్నం, సింగరాయకొండ, ఎన్‌జీపాడు మండలాల్లో కూడా పొలంలో ఉన్న కూరగాయలు, ఇతర పశుగ్రాస పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. అలాగే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఉపాధి పనులకు ఆటంకం
ఈ వర్షంతో జిల్లాలో ఉపాధి హామీ పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. అనేక గ్రామాల్లో బుధవారం పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని 715 పంచాయతీల్లో నిత్యం సుమారు లక్షా 10వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. బుధవారం వర్షం కారణంగా 212 గ్రామాల్లో పనులు ఆగిపోయాయి. మిగిలిన గ్రామాల్లో సుమారు 84వేల మంది పనులకు వచ్చినట్లు సమాచారం. అంటే వర్షంతో దాదాపు 25వేల మంది ఉపాధి కూలీలు పనులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది