సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:16 AM
ప్రతిఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథ కాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ దర్శి ఈఈ పి.శ్రీనివాసులు అన్నారు.
పొదిలి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : ప్రతిఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథ కాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ దర్శి ఈఈ పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని కాటూరివారిపాలెం గ్రామంలో సోలార్ విద్యుత్‌పై విద్యుత్ అధికారులకు, గ్రామస్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని భావితరాల వారికి ఆరోగ్యకరమైన పర్యావరణ సంపదను అందిద్దామన్నారు. ఈ పథకం క్రింద రెండు లక్షల విలువైన 3 కిలోవాట్‌ల సోలార్ ప్యానల్‌ను 78వేల సబ్సీడి రాయితీతో ప్రభుత్వం అంధిస్తుందన్నారు. 1కిలోవాట్ 30వేలు, 2కిలోవాట్‌లు 60వేలు, 3కిలోవాట్‌లు ఆపైన 78వేలు రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ పథకంలో తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణంకూడా పొందవచ్చన్నారు. అంతేకాకుండా 25 ఏళ్లపాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చన్నారు. ఇంటి అవసరాలకు పోను మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా తిరిగి ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇక వినియోగదారులు అధికలోడును క్రమబద్దీకరించుకునేందకు స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు. తద్వారా డెవలప్‌మెంట్ చార్జీలో 50శాతం రాయితీ పొందాలన్నారు. ఈ అవకాశం ఏప్రిల్ 1నుండి జూన్ 30వరకు సంబంధిత వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందన్నారు. మీకు దగ్గరలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఈ హరిబాబు సిబ్బంది పాల్గొన్నారు.