ఎలక్ర్టిక్ బస్సులపై రగడ
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:43 AM
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రవేశపెట్టే ఎలక్ర్టిక్ బస్సులపై రగడ నడుస్తోంది. ఆర్టీసీకి నేరుగా కాకుండా.. అద్దె ప్రాతిపదికన ప్రైవేటు కంపెనీలు నేరుగా నడిపేలా ఇవ్వబోతున్న అధికారాలపై సంస్థ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. కేంద్ర ప్రాయోజిత పథకం ఫేమ్ - 2 ద్వారా సమకూర్చుకునే విద్యుత బస్సుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలలో తీవ్ర అలజడి రేపుతోంది.
- విజయవాడకు వచ్చే 100 బస్సులు ఆర్టీసీ సొంతం కావు
- కేవలం అద్దె ప్రాతిపదికన ప్రైవేటు కంపెనీలతో ఏర్పాటు
- ఫేమ్ - 2 పథకంలో గైడ్‌లైన్స్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- ఉద్యోగ సంఘాల ఆక్షేపణ..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రవేశపెట్టే ఎలక్ర్టిక్ బస్సులపై రగడ నడుస్తోంది. ఆర్టీసీకి నేరుగా కాకుండా.. అద్దె ప్రాతిపదికన ప్రైవేటు కంపెనీలు నేరుగా నడిపేలా ఇవ్వబోతున్న అధికారాలపై సంస్థ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. కేంద్ర ప్రాయోజిత పథకం ఫేమ్ - 2 ద్వారా సమకూర్చుకునే విద్యుత బస్సుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలలో తీవ్ర అలజడి రేపుతోంది. ఆర్టీసీ పరిధిలో నడపాల్సిన విద్యుత బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పగించటాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టీసీలో చాలా కాలంగా డిమాండ్‌కు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయటం లేదు. ఇలాంటి సందర్భంలో విద్యుత బస్సులు వస్తున్నాయన్న సమాచారం ఉద్యోగులతో పాటు ప్రయాణికులను కూడా కొంతకాలంగా సంతోషపెడుతోంది. కానీ ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా విద్యుత బస్సులను ఆర్టీసీ కాకుండా ప్రైవేటు సంస్థలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండటంతో వాటిని తప్పనిసరిగా పాటి ంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్టీసీకి ఇచ్చే ఎలక్ర్టికల్ బస్సులను గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తరహాలో కేంద్రం గ్రాంట్ (సెంట్రల్, స్టేట్, ఆర్టీసీ షేర్) గా కాకుండా ప్రైవేటు సంస్థలకు అద్దె ప్రాతిపదికన నడిపేలా అనుమతులు ఇస్తోంది. దీంతో ఎలక్ర్టిక్ బస్సులు ఆర్టీసీ సొంతం కావు. కేవలం అద్దె బస్సులుగానే ఉంటాయి. గతంలో ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పటి నుంచి ఆర్టీసీలో అద్దె బస్సులను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై సమ్మెలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. సమ్మెల తర్వాత సంస్థలో 20 శాతం మించి అద్దె బస్సులను ప్రవేశపెట్టేది లేదని ఆనాడు ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ తర్వాత క్రమంలో ఒప్పందాల ఉల్లంఘన జరిగింది. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే మరీ దారుణంగా 40 శాతం మేర అద్దె బస్సులకు టెండర్లు పిలిచారు. ఇంకో పది శాతం పెరిగితే ఆర్టీసీలో సగం మేర అద్దె బస్సుల స్థానం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో విద్యుత బస్సుల ఆగమనంతో ఆర్టీసీ బస్సుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావించారు. విజయవాడ నగరానికి తొలి విడతగా 100 ఎలక్ర్టిక్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సులన్నింటిని విద్యాధరపురం బస్ డిపో పరిధి నుంచి ప్రైవేటు సంస్థ నడుపుతుంది. ఈ బస్సులన్నీ కూడా ఆర్టీసీకి సొంతంగా రావటం లేదు. కేంద్రం ఏ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీయే ఆర్టీసీ బస్ డిపోల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు ఈ బస్సులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఆర్టీసీతో పాటు సమాంతర ప్రైవేటు యాజమాన్యం అధికారం చెలాయిచే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దశల వారీగా సంస్థకు వచ్చే ఎలక్ర్టికల్ బస్సులన్నింటినీ ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తుంటే ఆర్టీసీ పాత్ర నామమాత్రమౌతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ర్టికల్ బస్సులను అందించే కంపెనీలకు ఆర్టీసీ డిపోలు షెల్టర్ ఇస్తాయి. ప్రైవేటు కంపెనీ ప్రయోజనాల కోసం ఆర్టీసీ డిపోలను వాడుకుంటారు. అద్దె ప్రాతిపదికన ఇచ్చే బస్సులను ఆ కంపెనీయే మెయింటినెన్స్ వ్యవహారాలను చూడాల్సి ఉంటుంది. దాని కోసం సొంతగా గ్యారేజీలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ, ఆర్టీసీ గ్యారేజీలనే ప్రైవేటు కంపెనీలు ఉపయోగించుకుంటాయి. ఎలక్ర్టికల్ బస్సుల కోసం ఆర్టీసీ అధికారులే విద్యుత కనెక్షన్ కోసం దర ఖాస్తు చేశారు. అద్దె ప్రాతిపదికనే అయినపుడు ఆర్టీసీ ఎందుకు హైటెన్షన్ విద్యుత కనెక్షన్ కోసం దరఖాస్తు చేయాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత, ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ భారం కూడా ఆర్టీసీ మోయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అయితే విద్యుత బస్సులను స్వాగతిస్తున్నామని, నిర్వహణ మాత్రం ఆర్టీసీ స్వయంగా చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా జరిగే మాత్రం ఆందోళనకు సమాయత్తమౌతామని హెచ్చరిస్తున్నాయి.