Real Estate: అనుమతుల అధికారం మున్సిపల్స్‌కే
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:00 AM
భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతి కోసం ప్రస్తుతమున్న విధానంతో విసిగిపోతున్న రియల్ వ్యాపారస్థులు, నిర్మాణ రంగ పెట్టుబడిదారులు కొత్త పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆర్డినెన్స్‌లు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల
రెండు చోట్ల అనుమతులు, కమీషన్ల భారం
తప్పిందంటున్న పట్టణవాసులు
భవన నిర్మాణ, రియల్ రంగాలు పుంజుకునే చాన్స్
‘రియల్’ బూమ్ కోసం సడలింపులు: మంత్రి
ఎన్‌బీసీకి అనుగుణంగా ఉత్తమ విధానాలు
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతి కోసం ప్రస్తుతమున్న విధానంతో విసిగిపోతున్న రియల్ వ్యాపారస్థులు, నిర్మాణ రంగ పెట్టుబడిదారులు కొత్త పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు. దానికి అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలకు మాత్రమే భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులిచ్చే అధికారం కల్పించి, పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రాజెక్టుల అభివృద్ధి బాధ్యతలు కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి అనుగుణంగా గతంలో ఉన్న ఏపీ భవన నిర్మాణ నిబంధన లు-2017, ఏపీ ల్యాండ్ డెవల్‌పమెంట్ రూల్స్-2017ను సవరిస్తూ గెజిట్‌లను జారీ చేస్తున్నట్లు పేర్కొంటూ శుక్రవారం జీవోలు జారీ చేశారు. దానికి సంబంధించి యాప్ రూపొందించాలని నిర్ణయించారు. దీంతో భవ న నిర్మాణాలు ఊపందుకుంటాయని, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
పట్టణ ప్రజలకు ఊరట కలిగించేందుకు...
పట్టణాభివృద్ధి అథారిటీలకు భవనాల నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులిచ్చే అధికారం తొలగించి మున్సిపాలిటీలకు అప్పగించాలని నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థల్లో మినహా మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులివ్వడంలో కొన్ని పరిమితులున్నాయి. భారీ భవంతులు, భారీ విస్తీర్ణంలోని లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తులను పట్టణ స్థానికసంస్థల ద్వా రా పట్టణాభివృద్ధి సంస్థలకు పంపుతున్నారు. వాటికి అనుమతి లభించడంలో జాప్యం జరగడంతో పాటు, పట్టణ స్థానికసంస్థల్లోను, ఇటు పట్టణాభివద్ధి అథారిటీల్లోనూ రెండింటా అక్రమ వసూళ్లతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రజలకు రెండు చోట్ల అనుమతులు పొందడంలో ఇబ్బంది కలగడంతో పాటు రెండు చోట్ల వ్యయం కూడా ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని సరళతరం చేయాలని నిర్ణయించింది. మున్సిపల్ శాఖ సిఫారసులతో గత కేబినెట్‌లో దీనిపై చట్టం తెచ్చేందుకు నిర్ణ యం తీసుకుంది. ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశంలో దానికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదించారు. శుక్రవారం ఆర్డినెన్స్ విడుదల చేశారు.
వైసీపీ కాలంలో అథారిటీలతో దోపిడీ
వైసీపీ హయాంలో ఎక్కువ పట్టణాభివృద్ధి అథారిటీలు ఏర్పాటు చేశారు. గతంలో పట్టణాభివృద్ధి అథారిటీలకు విశేష అధికారాలను తెచ్చుకుని మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, అథారిటీ చైర్మన్లు ప్రజల నుంచి భారీగా వసూళ్లు చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పట్లో భవన నిర్మాణాల అనుమతులు, టీడీఆర్ బాండ్ల విడుదలలో కీలకపాత్ర పోషించేవారు. భారీగా సొమ్ము చేసుకున్నారు.