రోడ్లకు సంక్రాంతి
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:38 AM
ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంక్రాంతి శోభ వచ్చింది. గుంతలతో నిండిన రోడ్లకు మరమ్మతులు వేగవంతంగా జరుగుతుండడంతో పండుగకు వచ్చే వారి ప్రయాణం సుఖవంతంగా జరుగుతోంది.
మొదటి విడత రూ.22 కోట్లతో 948 పనులు
ఇప్పటికే 700 వరకు పూర్తి
నెలాఖరుకు మొత్తం పూర్తి
రెండో విడతలో రూ.75.16 కోట్లతో 123 పనుల గుర్తింపు
పండుగ ప్రయాణం సుఖమయం.. జనం హర్షం
ఏలూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) :ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంక్రాంతి శోభ వచ్చింది. గుంతలతో నిండిన రోడ్లకు మరమ్మతులు వేగవంతంగా జరుగుతుండడంతో పండుగకు వచ్చే వారి ప్రయాణం సుఖవంతంగా జరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి గత పండుగకు వచ్చినప్పుడు రోడ్లు ? ఈ ఏడాది పండుగకు వచ్చినప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ? తేడా గమనిస్తున్నారు.
సంక్రాంతిని జోష్‌గా జరుపుకునేందుకు వీలుగా పల్లె, పట్నం రోడ్లు అభివృద్ధి బాటలో పడ్డాయి. దీంతో ఊరు, నగరం అనే తేడా లేకుండా కార్లు, ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు రయ్యమంటూ తమ స్వస్థలాలకు చేరాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో గుంతలు పడ్డ రోడ్లను కనీసం పూడ్చేందుకు కూడా ఉపక్రమించలేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి రెండు నెలలు ప్రణాళిక, 100 రోజుల ప్లాన్ తదితర సూక్ష్మస్థాయి ప్రణాళికలతో రోడ్లకు మహర్దశను పట్టించారు. సంక్రాంతికి డెడ్‌లైన్‌గా పనులు చేయాలని రంగం సిద్ధం చేయగా, దాదాపుగా 80 నుంచి 90 శాతం వరకు పనులు పురోగతిలో పడ్డాయి. ఏలూరు జిల్లాలో గుంతలు పడిన రోడ్ల మరమ్మతులకు మొదటి విడతగా 948 పనులు గుర్తించగా రూ.22 కోట్లతో పనులు చేపట్టి వాటిలో 700 వరకు పూర్తి చేశారు. పండుగ సెలవుల అనంతర మిగిలిన పది రోజుల్లో ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. పల్లె పండుగ పేరిట జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 1,062 పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పొలం పుంతలను, డొంకరోడ్లకు మరమ్మతులు చేపట్టారు. రోడ్లు, భవనాలశాఖకు చెందిన 158 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్ల బాగుచేత పురోగతిలో ఉంది. రెండో విడతగా 123 పనులను రూ.75.16 కోట్లతో 523 కిలోమీటర్ల పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇవి పూర్తయేల్లోగా పల్లెలు, పట్టణాల్లో సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు శ్రీకారం చుట్టనుంది. ఏలూరు నగరంలోని రోడ్లపైనా దృష్టి పెట్టారు.