వైసీపీ శ్రేణుల హడావిడి
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:13 AM
పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ పోలీసుల విచారణకు హాజరైన సమయంలో వైసీపీ కార్యకర్తలు హడావిడి చేశారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పోరేషన్ మేయర్‌కు ప్రభుత్వం కేటాయించిన కారులో పీడీఎస్ బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధ పోలీస్ స్టేషన్‌కు రావడం వివాదాస్పదమైంది.
మేయర్ కారులో విచారణకు హాజరైన పేర్ని జయసుధ
రెండున్నర గంటలపాటు సాగిన విచారణ
అంతా మేనేజర్‌కే తెలుసు... నాకేమీ తెలియదని వెల్లడి
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ పోలీసుల విచారణకు హాజరైన సమయంలో వైసీపీ కార్యకర్తలు హడావిడి చేశారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పోరేషన్ మేయర్‌కు ప్రభుత్వం కేటాయించిన కారులో పీడీఎస్ బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధ పోలీస్ స్టేషన్‌కు రావడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ కారులో ఎ1ను ఎలా తీసుకువస్తారనే విషయమై విమర్శలు వినిపించాయి. విచారణ వచ్చిన పేర్ని జయసుధతోపాటు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మీ తదితరులు ఆమెతోపాటు స్టేషన్‌లోనే ఉన్నారు. పేర్ని జయసుధ విచారణ నిమిత్తం తాలూకా పోలీస్‌స్టేషన్‌కు రావడంతో వైసీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ వద్దకు తరలివచ్చారు. రెండున్నర గంటలపాటు విచారణ కొనసాగడంతో అనారోగ్యంతో ఉన్న మహిళను ఎంతసేపు విచారణ చేస్తారంటూ వైసీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానాకి దిగారు. విచారణ జరిగే సమయంలో ఆమె ఏమైౖనా ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై వైసీపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు తలుపులు తెరచి పేర్ని జయసుధతో తానేమీ ఇబ్బంది పడటంలేదని చెప్పించాల్సి వచ్చింది. ఎస్సై సత్యనారాయణ ఆమె బాగానే ఉన్నారని, ఎవరూ కంగారుపడవద్దని చెప్పారు. అయినా వారు సమాధానపడకుండా ‘మీకేమీ కంగారు ఉండదని, మా క్లయింట్ విషయంలో మాకు కంగారు ఉంటుందని’ లాయర్ అంకబాబు వ్యాఖ్యానించారు.పెద్దఎత్తున వైసీపీ నాయకులు పోలీస్‌స్టేషన్ వద్దకురావడంతో వారందరిని దూరంగా పంపే ప్రయత్నం పోలీసులు చేశారు. పేర్ని జయసుధ విచారణ సుమారు రెండున్నర గంటలపాటు సాగింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సాయంత్రం 4.30 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రాబర్ట్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్ సీఐ ఏసుబాబు, మచిలీపట్నం తాలూకా స్టేషన్ ఎస్సై సత్యనారాయణ ఆమెను విచారించారు. ఈ సమయంలో పేర్ని జయసుధ తరపు న్యాయవాదులు వరదరాజులు, అంకబాబు అక్కడే ఉన్నారు. గోడౌన్ వివరాలు, ఎవరి పేరున ఉంది, నగదు లావాదేవీలు ఎవరు చూసేవారు, తదితర అంశాలపై పోలీస్ అధికారులు వివరాలు రాబట్టారు. గోడౌన్ వ్యవహారాలు తాను చూడలేదని, కేవలం గోడౌన్ యజమానిగా మాత్రమే తాను ఉన్నానని, గోడౌన్ మేనేజర్ మానస్ తేజ మొత్తం వ్యవహారాలు చూసేవారని, తనకేమీ తెలియదని పేర్ని జయసుధ పోలీస్ అధికారులకు చెప్పినట్టు సమచారం. ఈ కేసు విచారణ నిమిత్తం అవసరమైతే మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు పేర్ని జయసుధకు తెలిపారు.